అధికారం ఉన్నా కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు?

ఇతర ప్రభుత్వ శాఖల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పై వచ్చే అధికారులు తమ డిప్యూటేషన్ గడువు ముగిసినా.... Special Story on GHMC officers

Update: 2023-03-04 03:05 GMT

దిశ, సిటీబ్యూరో: ఇతర ప్రభుత్వ శాఖల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పై వచ్చే అధికారులు తమ డిప్యూటేషన్ గడువు ముగిసినా, సీట్లను వదలకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. తొలుత మూడేళ్ల డిప్యూటేషన్ అంటూ ఇక్కడకు వచ్చి వాలుతున్న అధికారులు ఆ తర్వాత తమ మాతృశాఖలో పైరవీలు చేసుకుని మూడేళ్లను కాస్త అయిదేళ్లకు పెంచుకుంటున్నారు. ఇలాగనే చేసిన ఓ ఇంజినీర్ ఇటీవలే తన కిందిస్థాయి సిబ్బందిని వేధింపులకు గురిచేస్తుండటంతో ఆ అధికారి డిప్యూటేషన్ పై వచ్చిన విషయం కమిషనర్ లోకేశ్ కుమార్‌కు తెలిసింది. మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేస్తుండటంతో పలు యూనియన్లు సైతం ఆయనను పంపించేయాలంటూ ఫిర్యాదులు చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ సదరు అధికారి తన మాతృశాఖకు వెళ్లాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ సూపరింటెండెంట్ ఇంజినీర్ మాత్రం కమిషనర్ చెప్పినా, వెళ్లేదే లేదంటూ భీష్మించుకున్నట్లు సమాచారం. పైగా డిప్యూటేషన్ గడువును పెంచేందుకు విద్యుత్ శాఖ కూడా నిరాకరించినట్లు సమాచారం. అయినా సదరు అధికారి తన డిసెంబర్, జనవరి నెలల జీతాలను జీహెచ్ఎంసీలోనే క్లెయిమ్ చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. జీతాల క్లెయిమ్ ఫైల్‌ను రన్ చేయలేదన్న కోపంతో వేధింపులకు పాల్పడినట్లు ఈ అధికారిపై షీ టీమ్స్‌కు ఫిర్యాదులు కూడా అందాయి. ఇప్పటికే పోలీసు అధికారులు ఓ దఫా విచారణ కూడా చేపట్టినట్లు సమాచారం. తనపై ఫిర్యాదులు చేసిన కిందిస్థాయి సిబ్బందిని టార్గెట్ చేసుకుని మళ్లీ వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఇలా ఇంకెంతోమంది..

జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్ పై పోస్టింగ్ దక్కించుకునే అధికారులు ఒక్కసారి బల్దియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తిరిగి మాతృశాఖకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ తరహాలోనే కమిషనర్ ఆదేశాలు లెక్కచేయకుండా సీట్లలోనే కొనసాగుతున్న అధికారులు వందల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఖైరతాబాద్ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ కూడా ఇదే రకంగా కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీటులో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కమిషనర్ నేరుగా మున్సిపల్ శాఖకు చెందిన ఓ పెద్ద సారు ముందు ప్రస్తావించగా, చూసీచూడనట్టు వ్యవహరించాలంటూ ఆ సారు సంకేతాలివ్వటంతో చేసేదేమీ లేక కమిషనర్ మౌనంగా ఉండిపోయారు.

వెళ్లకపోతే...

కమిషనర్ ఆదేశాల మేరకు సదరు ఇంజినీర్ బల్దియా నుంచి రిలీవ్ కాకపోతే కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చున్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సదరు ఇంజినీర్ మాతృశాఖ డిప్యూటేషన్ గడువు పొడిగింపునకు అంగీకరించకపోవటంతో జీహెచ్ఎంసీ కమిషనర్ నేరుగా ఆయనను పేరెంట్ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్ చేసే అధికారం కమిషనర్‌కు ఉన్నట్లు పలువురు యూనియన్ నేతలు చెబుతున్నారు. ఈ రకంగా ఖైరతాబాద్ మెడికల్ ఆఫీసర్‌ను, ప్రస్తుత ఇంజినీర్‌ను కూడా సరెండర్ చేస్తూ ఉత్తర్వులు చేసే అధికారం ఉన్నా, కమిషనర్ ఎందుకు ఆదిశగా చర్యలు తీసుకోవటం లేదు? ఎవరి నుంచి ఒత్తిడి వస్తుందన్నది త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News