మినరల్ వాటర్ ప్లాంట్లపై సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు మినరల్ వాటర్ ప్లాంట్స్‌పై సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు.
దిశ, చార్మినార్ : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు మినరల్ వాటర్ ప్లాంట్స్‌పై సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో మోసం చేస్తూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ముగ్గురుని సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,34,080 విలువగల 500 ఎంఎల్ 23808 వాటర్ బాటిళ్లు, 1000 ఎంఎల్ 4800 వాటర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం ... చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత కొంత కాలంగా బ్రాండెడ్ కంపెనీల పేర్లు చిన్న మార్పులతో నిబంధనలకు విరుద్దంగా మినరల్ వాటర్‌ను తయారు చేస్తున్న మూడు వాటర్ ప్లాంట్స్ పై విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు.
వేర్వేరు ప్రాంతాలలో దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా మినరల్ వాటర్ బాటిళ్లను తయారు చేస్తున్న వాటర్ ప్లాంట్ యజమానులు చార్మినార్‌కు చెందిన మొహమ్మద్ సజ్జాద్ (34), మాసబ్ ట్యాంక్‌కు చెందిన సయ్యద్ సిరాజ్ (36), చాంద్రాయణగుట్ట కు చెందిన సలాం బిన్ నాజర్ అన్ నకీబ్ (46)లను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. బిఐఎస్తో పాటు ట్రేడింగ్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఎఐ లేకుండా మినరల్ వాటర్ బాటిళ్లను తయారు చేస్తున్న పోలీసులు గుర్తించారు. అలాగే బిస్లరీ పేరును చిన్న మార్పులతో బిస్ల్టెరీగా, బ్రిషెరీగా బార్లీగా, కిన్లీ ని కిన్వీగా పేర్లు మార్చి పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.3,34,080 విలువగల వాటర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీస్స్టేషన్లకు అప్పగించారు. మినరల్ వాటర్ బాటిల్స్ కొనేటప్పడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, టిడిఎస్ తక్కువగా ఉన్న నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఈ దాడుల్లో ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ అధికారులు, ఎస్ కె కవియుద్దీన్, పి.సాయిరామ్, మధు తదితరులు ఉన్నారు.