టౌన్ ప్లానింగ్‌ను వేధిస్తున్న సిబ్బంది కొరత
మహా నగరవాసులకు ముఖ్యమైన పౌర సేవలందించే జీహెచ్ఎంసీలో ఇప్పటికే అంతర్గత బదిలీలకు రంగం సిద్ధం కాగా, పనిలో పనిగా టౌన్ ప్లానింగ్ విభాగంలో సైతం బదిలీలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దిశ, సిటీ బ్యూరో : మహా నగరవాసులకు ముఖ్యమైన పౌర సేవలందించే జీహెచ్ఎంసీలో ఇప్పటికే అంతర్గత బదిలీలకు రంగం సిద్ధం కాగా, పనిలో పనిగా టౌన్ ప్లానింగ్ విభాగంలో సైతం బదిలీలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం వివిధ విభాగాల వారీగా చేసిన బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) కి చెందిన 20 మంది అధికారులు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో జీహెచ్ఎంసీకి 14 మంది రావడంతో టౌన్ ప్లానింగ్ విభాగానికి మళ్లీ సిబ్బంది కొరత ఏర్పడింది. వచ్చిన 14 మందికి ఎక్కడెక్కడ పోస్టింగులు ఇవ్వాలన్న విషయంపై కొత్తగా చీఫ్ సిటీ ప్లానర్ గా వచ్చిన శ్రీనినాస్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్, టీపీఎస్‌లు ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది చార్మినార్ జోన్ మినహా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ జోన్లలో పోస్టింగుల కోసం పైరవీలు చేస్తున్నారు. వీరిలో కొందరు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలోని ఉన్నతాధికారుల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటుండగా, మరి కొందరు మంత్రుల వద్దకు చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం.
వెంటాడుతున్న సిబ్బంది కొరత
బదిలీ కన్నా ముందే సిబ్బంది కొరతతో అల్లాడిపోతున్న ప్లానింగ్ విభాగానికి ఈ బదిలీల కారణంగా మరో ఆరుగురు ఆఫీసర్లు తగ్గారనే చెప్పవచ్చు. దీంతో సిబ్బంది కొరత మరింత అధికమయ్యే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీకి సుమారు 420 మంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది అవసరం కాగా, ప్రస్తుతం వందలోపే ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరతతో రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగకపోవడంతో పాటు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే వీల్లేకుండా పోయింది.