నగరంలో బయటపడ్డ సెల్ఫ్ డ్రైవ్ కార్ల మోసం
సెల్ఫ్ డ్రైవ్ కు కార్లను ఇస్తే నెలనెలా అద్దె చెల్లిస్తామంటూ పదుల సంఖ్యలో కార్లను తీసుకుని,
దిశ, శేరిలింగంపల్లి : సెల్ఫ్ డ్రైవ్ కు కార్లను ఇస్తే నెలనెలా అద్దె చెల్లిస్తామంటూ పదుల సంఖ్యలో కార్లను తీసుకుని, వేరే వారికి అప్పగించి నెలనెలా వారి వద్ద రెంట్ తీసుకుంటూ.. అసలు ఓనర్లకు అద్దె చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న కిలేడి ఆటకట్టించారు రాయదుర్గం పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్, అడిషనల్ డీసీపీ జయరాం ఇతర పోలీసు అధికారులతో కలిసి వెల్లడించారు. గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన జూపిడి ఉషా, ఆమె డ్రైవర్ తుడుముల మల్లేశ్ కలిసి కార్ రెంటల్ సర్వీస్ నడుపుతున్నారు. అందులో భాగంగా ఆమె పలువురి నుంచి కార్లను సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు.
వాటిని బీదర్ కు చెందిన సాగర్ పాటిల్, బాల్కికి చెందిన జమానే అనిల్ కుమార్ కు ఇచ్చి కర్ణాటక ప్రాంతంలో అద్దెకు ఇచ్చి అక్కడ తిప్పుతూ వారి నుండి నెలనెలా అద్దె వసూళ్లు చేస్తున్నారు. కానీ కార్ల అసలు ఓనర్లు తమ కారు ఎక్కడ ఉంది. రెంట్ ఎప్పుడు ఇస్తారని అడిగినా స్పందించక పోవడంతో కార్ల యజమానులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం సీఐ వెంకన్న, డీఐ సతీష్ కుమార్ లు దర్యాప్తు చేపట్టి జూపూడి ఉషా ఆమె డ్రైవర్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మహేంద్ర థార్ కార్లు 4, ఎర్టీగా 10, ఇన్నోవా క్రిస్ట 1, స్విఫ్ట్ కార్లు 3, వెన్యూ, కారు 1, ఐ 20 కారు 1, గ్రాండ్ ఐ 10 కారు 1, మొత్తం రూ.2 కోట్ల 50 లక్షల విలువైన 21 కార్లను వారి నుండి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వినీత్ తెలిపారు.