జీహెచ్ఎంసీ చుట్టూ రాజకీయాలు.. పార్టీ మారిన వారికేనా ఎంపీ టికెట్లు ..?
పార్లమెంట్ ఎన్నికల ముంగిట గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ
దిశ , హైదరాబాద్ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల ముంగిట గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్టీలు మరెందుకు ప్రతిపక్ష నాయకులు ఆసక్తి చూపుతుండగా అధికార కాంగ్రెస్ పార్టీ వారికి పెద్ద పీఠ వేస్తోంది.తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సుమారు మూడు నెలల పాటు పార్టీ ఫిరాయింపులకు దూరంగా ఉన్న అధికార పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది .ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి తదితరులు ముందుగానే పార్టీ మారగా తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ను దక్కించు కున్నారు.
దీంతో బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది . ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా లేని కాంగ్రెస్ పార్టీకి దానం చేరికతో బోణికొట్టినట్లైంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ పుండు మీద కారం లా మరి కొంతమంది నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఆమె తండ్రి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే, కుమారుడు, సుమారు పది మందికి పైగా కార్పొరేటర్లు సైతం త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి .
పార్టీ మారిన వారికే టిక్కెట్లు..
పార్టీలు మారిన వారికే అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, పార్టీ సికింద్రాబాద్ టికెట్ కేటాయించడం వెంట వెంటనే జరిగిపోయాయి . మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించకపోవడం టికెట్ ఆశిస్తున్న వారిని టెన్షన్ కి గురి చేస్తోంది. పార్టీకి మొదటి నుంచి పని చేసిన వారికి హైదరాబాద్ టికెట్ ఇస్తారా ? లేక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన వారికి కేటాయిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఎంఐఎం కనుసన్నల్లోనే....?
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ఎంఐఎం చేతిలో ఉందనే టాక్ గ్రేటర్ వ్యాప్తంగా వినబడుతోంది. ఎంఐఎం సూచించిన అభ్యర్థికే పార్టీ టికెట్ ఇస్తారని, గతంలో కూడా ఇలాగా జరిగిందని పలువురు నాయకులు బాహాటంగా చర్చించుకుంటున్నారు . నామమాత్రపు పోటీ ఇచ్చే వారిని ఎంపిక చేస్తారని, ఇందు కోసమే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదని గుసగుసలు వినబడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ లు డిక్లేర్ చేయాల్సి ఉంది.