మైనర్ బాలికను రక్షించిన ఆర్‌పీఎఫ్ పోలీసులు
మానవ అక్రమ రవాణా కు గురైన 16 ఏళ్ల బాలికను సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) పోలీసులు రక్షించారు.
దిశ, మెట్టుగూడ: మానవ అక్రమ రవాణా కు గురైన 16 ఏళ్ల బాలికను సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) పోలీసులు రక్షించారు. అక్టోబరు 31వ తేదీ రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రోజువారీ చెకింగ్‌లో భాగంగా ప్లాట్ ఫాం1 లో చెకింగ్ చేస్తుండగా ఒక మైనర్ బాలిక భయంతో అటు ఇటు చూస్తూ కనిపించడం గమనించారు. వెంటనే లేడీ ఆర్‌పీఎఫ్ సిబ్బందిని పిలిపించి చిన్నారిని సంప్రదించారు, 16 ఏళ్ల బాలిక యోగక్షేమాలు తెలుసుకుని మేము నీకు భద్రత కల్పిస్తాము అని భరోసా ఇచ్చారు. బాలిక తను బీహార్ రాష్ట్రం కేషన్ గుంజ్ నివాసి అని వెల్లడించింది. ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో మానవ అక్రమ రవాణా ఉచ్చులో పడింది అని ఆర్‌పీఎఫ్ పోలీసులకు అర్థమయ్యింది.
వెంటనే చైల్డ్‌లైన్ ప్రతినిధులను (ఎంవోయూ చేసుకున్న బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థ) సంప్రదించారు. మైనర్ బాలిక అక్రమ రవాణాకు గురైనందున ఆమె మానసిక స్థితి బాగా లేదని గ్రహించి నేరస్తుల వివరాలను తెలియజేయడానికి కౌన్సిలింగ్ చేశారు. రూ. 5,000 లకు ఉద్యోగం ఇప్పిస్తానని తన గ్రామానికి చెందిన ఒక నేరస్తుడు అదే గ్రామానికి చెందిన మరో నలుగురు బాలికలతో కలిసి తనకు మత్తుమందు ఇచ్చి హర్యానాలోని పింజోర్‌కు తీసుకెళ్లినట్లు చిన్నారి వెల్లడించింది. తర్వాత అమ్మాయిని బలవంతంగా లైంగిక వ్యాపారంలోకి దించాడు. ఒకరోజు రైల్వే స్టేషన్‌కు పారిపోయి సీటు కింద దాక్కున్నానని రైలు ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని ఆ అమ్మాయి తెలిపింది.
మరుసటి రోజు దిగి మరో రైలు ఎక్కి హైదరాబాద్ చేరుకున్నాను, ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోవాలనుకున్నానని పేర్కొంది. ఆర్‌పీఎఫ్ సికింద్రాబాద్, బచ్పన్ బచావో ఆందోళన్ ప్రతినిధులు బీహార్ పోలీసులను, బీహార్‌లోని BBA అధికారులను సంప్రదించారు. అక్కడ అప్పటికే తల్లిదండ్రులు అమ్మాయి కనిపించడం లేదు అని బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లా, కొచ్చాధమన్ PS లో కేసు నమోదు చేయబడింది. మైనర్ బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరిచారు.
ప్రతి సంవత్సరం RPF సిబ్బంది రైల్వే స్టేషన్ ద్వారా మానవ ట్రాఫికర్లచే అక్రమ రవాణా, బలవంతపు లైంగిక వ్యాపారం, అవయవ వ్యాపారం నుండి వేల మంది పిల్లలను రక్షిస్తుంది. 2022లో RPF సిబ్బంది సికింద్రాబాద్ డివిజన్‌లో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 12 కేసులను ఛేదించింది. అక్రమ రవాణా జరగకుండా అహర్నిశలు కృషి చేస్తుంది. సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ RPF దేబాష్మితా ఛటోపాధ్యాయ మాట్లాడుతూ.. ప్రయాణికులచే రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లో బాధిత మైనర్ బాలికను గుర్తించి, సురక్షితంగా కాపాడం తో పాటు తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. మేము రైల్వేలో మానవ అక్రమ రవాణాపై దృష్టి పెడుతున్నాం. కాబట్టి సికింద్రాబాద్ డివిజన్ అంతటా 12 మానవ అక్రమ రవాణా వ్యతిరేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపింది.