ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర.. పలువురు అరెస్టు..
టీఎస్పీఎస్సీ చైర్మన్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలని బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
దిశ, సికింద్రాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలని బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చైర్మన్ తో పాటు సభ్యులను తొలగించి, ప్రక్షాళన చేసి, తక్షణమే నూతన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఉస్మానియా యూనివ్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఓయూ మెయిన్ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్ది నిరుద్యోగులతో కలిసి డప్పు కొట్టుకుంటూ శవయాత్ర చేపట్టారు. అనంతరం దిష్టి బొమ్మ దహనానికి యత్నించి విఫలం అయ్యారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టుచేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్, ఓయు జాక్ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దొంగల చేతికి తాళాలు ఇచ్చిందన్నారు.
ఆ దొంగలే సంతలో సరుకు లెక్క కోట్ల రూపాయలకు పేపర్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీలో విచారణ ఎదుర్కొంటున్న బోర్డు చైర్మన్, సభ్యులు, కార్యదర్శి, మళ్ళీ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇది నలబై లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమే అన్నారు. బోర్డు ప్రక్షాళన చేసి నూతన బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అంతవరకు పరీక్షలు నిర్వహించకూడదన్నారు. సీఎంఓలో కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి బావ ఎల్లారెడ్డి, తెలంగాణ జాగృతి కామారెడ్డి అధ్యక్షురాలు, బీఆరెస్ పార్టీ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డిలను ఒక రాజ్యాంగ బద్ద సంస్థలో సభ్యులుగా ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నించారు. నూతన బోర్డును ఏర్పాటు చేసి, ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయినా వారిలో పల్లెల సుధాకర్ ఎంఎస్ఎఫ్ జాతీయ జనరల్ సెక్రెటరీ, డీబీఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిల్ దర్శన్, ఏఎస్ఏ ఆదివాసి స్టూడెంట్ ఫోరం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్, ఎస్ఎస్సీ సురేష్ లు ఉన్నారు.