ఉస్మానియా యూనివర్సిటీని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల పూర్వ విద్యార్ధి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను శనివారం ఘనంగా సన్మానించారు.
దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల పూర్వ విద్యార్ధి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యూనివర్సిటీలు, సంస్థలను నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. వర్సిటీలలో ఉద్యోగ భర్తీ 2013లో జరిగిందని, ఇప్పటి వరకు అధ్యాపక నియామకాలు జరగకపోవడంతో నాణ్యత దెబ్బతినే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని అన్నారు. వర్సిటీ భూములు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. యూనివర్సిటీలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలకు ప్రభుత్వ నిధులు, నియామకాలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎస్ఆర్ నిధుల కోసం కార్పొరేట్ సంస్థలకు లేఖలు పంపాలని, దానికోసం సమగ్ర డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియా యూనివర్సిటీని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సాధారణ ప్రజలకు నాణ్యమైన, సరైన వైద్య సౌకర్యాలు, భద్రత అత్యవసరమని చెప్పారు. వాటిని ప్రజలకు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భావనతో ముందుకు సాగాలని కోరారు. తాను ఈ స్థాయిలో ఉండేందుకు కారణమైంది ఓయూ ఇంజనీరింగ్ కళాశాలే అని అన్నారు. డబ్బు కోసం రాజకీయాలు చేయడం ప్రమాదమని చెప్పారు. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి ఓటమి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని వివరించారు.
దీనిని తాను తన తండ్రి, స్నేహితులు, ఓయూ నుంచే నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవరకొండ విజయ్ కుమార్, కార్యదర్శి డాక్టర్ వెంకటరామయ్య, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.