అధికారులకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తా

నందగిరి హిల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తానని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఉద్దేశించి దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-13 10:10 GMT

దిశ, హిమాయత్ నగర్ : నందగిరి హిల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తానని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఉద్దేశించి దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లు ఉందని, అందుకే తనపై కేసు పెట్టాడని, అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ తాను లోకల్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంగళవారం అవంతినగర్ లో స్థానిక కార్పొరేటర్ తో కలిసి సీసీ రోడ్లకు కోటీ 10 లక్షలతో అభివృద్ధి పనులకు దానం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నందగిరి హిల్స్ హుడా లే ఔట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, తాను అక్కడకి వెళ్లానని, జరిగిన విషయాన్ని రంగనాథ్‌ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

     కారంచేడులో దళితులపై జరిగిన దాడుల లాగా ఇక్కడ కొందరు సొసైటీ వ్యక్తులు గిరిజనులను బెదిరిస్తున్నారని, నందగిరి హిల్స్ కాస్మోపాలిటన్ సిటీ కావడంతో అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి కి కూడా ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, తనను అడ్డుకొనే అధికారం ఏ అధికారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదురించినందుకు తనపై కేసులు పెట్టారని, ఇప్పుడు పెట్టిన కేసులు కొత్తేమీ కాదని, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ఉంటానని చెప్పారు. పేద ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానని తెలిపారు. తనని 6 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించింది అధికారులు కాదని, ప్రజలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి, కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామన్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News