ఫ్లై ఓవర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి.. ఎమ్మెల్యేలు
శేరిలింగంపల్లి - కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కేపీ వివేకానంద సూచించారు.
దిశ, మియాపూర్ : శేరిలింగంపల్లి - కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కేపీ వివేకానంద సూచించారు. సోమవారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివేకానంద్, నిజాంపేట్ మేయర్ నీలాగోపాల్ రెడ్డి, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ఇరువురు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు నూతనంగా చేపట్టనున్న ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనుల పై చర్చించారు.
జేఎన్టీయూ నుండి ప్రగతినగర్ వెళ్లేరోడ్డులో నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుండటంతో ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్ ఏర్పాటుకు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు జూన్ 1వ తేదీ వరకు సిద్ధం చేసి తమ దృష్టికి తీసుకువస్తే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు సూచించారు. అదే విధంగా 172 సర్వే నెంబర్ మియాపూర్ లింక్ రోడ్డు నుండి నిజాంపేట్ కమాన్ వరకు రోడ్డు, నిజాంపేట్ ప్రధాన రోడ్డు వెడల్పు పనులు, నిజాంపేట్ మోర్ నుండి ప్రగతి నగర్ రోడ్డు అభివృద్ధి పనులకు అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేసి తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా రూ.130 కోట్లతో మియాపూర్ నుండి గండిమైసమ్మ రోడ్డు వెడల్పు విస్తరణ పనులు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఎమ్మెల్యేలు ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణం తలపించేలా అంబీర్ చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని, అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులకు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి చెరువులో గుర్రపు డెక్క తొలగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మురుగు నీరు చెరువులో చేరకుండా రూ.1.21 కోట్లతో నూతనంగా నాలా విస్తరణ పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యేలు ఆదేశించారు. ఈ సమావేశంలో నిజాంపేట్ కమిషనర్ రామకృష్ణ రావు, ఎస్.ఆర్.డి.పి ఎస్ఈ వెంకట రమణ, హెచ్.ఆర్.డీ.సీ.ఎల్ ఈఈ సర్దార్ సింగ్, కూకట్ పల్లి జోన్ టౌన్ ప్లానింగ్ సీపీ ఉమాదేవి, డీసీపీ రఘునందన్, ఏసీపీ రాణి, జీహెచ్ఎంసీ కూకట్ పల్లి జోన్ ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈ గోవర్ధన్, ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, ఈఈ నారాయణ, డీఈఈ నళిని, హెచ్ఎండిఏ ఎస్ఈ హుస్సేన్, ఈఈ హరికృష్ణ, ఈఈ రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.