నాగోల్, మియాపూర్ స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు
ప్రయాణికులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్) ప్రకటించింది.
దిశ, సిటీ బ్యూరో: ప్రయాణికులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్) ప్రకటించింది. ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చడానికి రెండు కీలక కార్యక్రమాలను వెల్లడించింది. జనాదరణ పొందిన కస్టమర్ ఆఫర్లను మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్‌ను అనుసరించి, ఎల్& టి ఎంఆర్ హెచ్ఎల్ తన ప్రసిద్ధ కస్టమర్ ఆఫర్లను 31 మార్చి 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రయాణికులకు గణనీయమైన పొదుపు, సరసమైన ధరలను అందిస్తాయని తెలిపింది.
సూపర్ సేవర్ ఆఫర్-59 : కేవలం రూ.59తో అపరిమిత ప్రయాణాన్ని ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ లిస్టెడ్ సెలవుల్లో ఆస్వాదించడానికి అవకాశముంది.
-స్టూడెంట్ పాస్ ఆఫర్ : విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ప్రత్యేక ఆఫర్, ఇది మెట్రో ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెస్తుంది.
-సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్ : రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డులపై (సీఎస్సీలు) 10% తగ్గింపును పొందడమే ఈ ఆఫర్ ఉద్దేశం. ఈ పొడిగింపుతో మెట్రో ప్రయాణానికి మరింత ఆదరణ పెరిగే అవకాశముందని పేర్కొంది.
ఈనెల 6 నుంచి పార్కింగ్ ఫీజు
పార్కింగ్ ఫీజు వసూలుకు మెట్రోరైలు సిద్ధమైంది. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల పరిధిలో మోటారు సైకిళ్లు, కార్లకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఈనెల 6 నుంచి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. మొదటగా నామమాత్రపు ఫీజులు వసూలు చేసి ఆ తర్వాత పెంచే అవకాశముంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్టు ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ ప్రకటించింది. ఈ పార్కింగ్ స్థలాలు ప్రయాణికుల సౌలభ్యం, భద్రతను నిర్ధారించడానికి అనేక సౌకర్యాలను అందిస్తున్నట్టు వెల్లడించింది.
ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్, ప్రయాణికుల కోసం బయో-టాయిలెట్లు, సాయంత్రం వేళల్లో తగిన వెలుతురు కోసం దీపాలు, 24/7 భద్రత, సీసీటీవీ కవరేజ్, లావాదేవీల సౌలభ్యం కోసం యాప్ /క్యు ఆర్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, సులభమైన పార్కింగ్, యాక్సెస్ కోసం లేన్ గుర్తింపు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, సమీప ఆస్పత్రి, పోలీస్ స్టేషన్, అగ్నిమాపక స్టేషన్ వంటి అత్యవసర సంప్రదింపు వివరాల ప్రదర్శన వంటి సౌకర్యాలను అందించడానికి కసరత్తు చేస్తోంది.