పిల్లలకు డబ్బులు ఇచ్చి పేరెంట్స్ చెడగొడుతున్నారు : టీఎస్ న్యాబ్ డైరెక్టర్
హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
దిశ, ఖైరతాబాద్: హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్‌లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య , సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి , రాచకొండ సిపి తరుణ్ జోషి , పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన, విద్యాశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది, పలు స్కూల్, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారి సినిమాలు చూడకూడదని సూచించారు. అలాంటి సినిమాలాను ఎంకరేజ్ చేయవద్దని అన్నారు. 21 ఏళ్లలోపు వాళ్ళకు మద్యం అమ్మకూడదు కానీ ఎవరు పట్టించుకుంటున్నారని మండిపడ్డారు. పిల్లల మానసిక స్థితిని పేరెంట్స్, టీచర్స్ గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారని తెలిపారు.
పిలల్లను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలను నిరుత్సాహ పరచకండి, ఉత్సాహ పరచాలని తెలిపారు. ఇంట్లో పరిస్థితుల కారణంగా టీనేజ్ వయస్సులోనే డ్రగ్స్ వైపు ఎందుకు బానిసలుగా మారుతున్నారని, ఇటీవల కాలంలో పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదని, జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. డ్రగ్ ఫ్రీ కార్యక్రమం ట్రై కమిషనరేట్ పరిధిలోని స్కూల్ యజమానులు, పేరెంట్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. గురువు స్థానం అనేది చాలా ముఖ్యమైన స్థానం, విద్యార్థులను మలిచే శక్తి గురువులకు ఉంటుందన్నారు. డ్రగ్స్ వినియోగం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది, ఇది కేవలం నగరాలలోని కాకుండా గ్రామాలకు కూడా వ్యాపించింది అన్నారు. పేరెంట్స్, విద్యాలయాలు, పాఠశాల నిర్వాహకులు విద్యార్థులు, యువత ఏం చేస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి అని సూచించారు. పాఠశాలలో, కళాశాలలో కేవలం అకడమిక్ సిలబస్ పైననే దృష్టి సారిస్తున్నారు కానీ జీవిత విలువలను, సమాజంలో ఎలా నడుచుకోవాలో గురువులు నేర్పించాలి అన్నారు.
చాలా మంది పేరెంట్స్ ఉద్యోగాలు చేస్తూ తమ పిల్లల ప్రవర్తనలో తేడాను గమనించే స్థితిలో ఉండటం లేదు , పిల్లలు ఎలా ఉంటున్నారో గమనించాలి, గురువులు కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులను గుర్తించాలి. ప్రతి విద్యాలయం లో ఆంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలి అన్నారు. విద్యాలయాలలో ఏర్పాటు చేసిన ఆంటీ డ్రగ్ కమిటీ సముదాయంతో ఫోరమ్ ఏర్పాటు చేస్తాము... ఈ ఫోరమ్ లో పోలీస్, విద్యాశాఖ కు సంబంధించిన సభ్యులు ఉంటారు అని తెలిపారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యా శాఖ వెంకటేశం మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు విలువలను నేర్పాల్సిన బాధ్యత విద్యాసంస్థలు తీసుకోవాలి అన్నారు. సమాజంలో విద్య, వైద్యం అనేది చాలా ముఖ్యం, పేరెంట్స్‌కి పిల్లల పైన ప్రేమ తక్కువ అయిన, అతి ప్రేమ ఉన్న కూడా పిల్లలు చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు అని అన్నారు. ఆంటీ డ్రగ్ కమిటీ విద్యాలయాలలో ఏర్పాటు చేసి, దాని ద్వారా డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం అన్నారు. గర్ల్స్ చైల్డ్ సేఫ్టీ గురించి కూడా విద్యాలయాలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.