చెరువులపై ఫోకస్.. బల్దియా కమిషనర్ కీలక ఆదేశాలు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఎట్టకేలకు చెరువులపై ఫోకస్ పెట్టారు...
దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఎట్టకేలకు చెరువులపై ఫోకస్ పెట్టారు. మార్నింగ్ వాక్‌లో శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ ఇప్పుడు చెరువుల పరిరక్షణ, సుందరీకరణపై దృష్టిసారించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నందున చెరువుల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో ఏమైనా సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే జోనల్ కమిషనర్లకు సూచించినట్లు సమాచారం.
హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 2,250 చెరువులుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 185 చెరువులున్నాయి. వీటికి ఇప్పటికే ఫెన్సింగ్ ఏర్పాటు చేయటంతో పాటు సీసీ కెమెరాలతో నిఘాను కూడా ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఈవీడీఎం జవాన్లతో సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినా, చెరువుల్లోకి మురుగు జలాలు ప్రవహించటం, భవన నిర్మాణ వ్యర్థాలు పడటం వంటి వాటికి బ్రేక్ పడటం లేదు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చెరువుల్లోకి మురుగు నీరు రాకుండా చేపట్టాల్సిన చర్యలపై హెల్త్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలిపి కమిషనర్ ఓ కమిటీని నియమించినట్లు సమాచారం. ఈ కమిటీ నగరంలోని మొత్తం 185 చెరువులను క్షేత్రస్థాయిలో సందర్శించి పలు వివరాలను సేకరించాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా చెరువులకు చుట్టూ ఫెన్సింగ్ ఉందా? లేదా? ఒక వేళ లేనిచో వెంటనే ఏర్పాటు చేయాలని, ఫెన్సింగ్ ఉండి ఉంటే అది ఎంత వరకు ధృడంగా ఉందన్న విషయాలను పరిశీలించి, చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం.
మురుగు నీరు చెరువులోకి భారీగా వస్తుందనుకుంటే ఆ నీరు చెరువులోకి ప్రవహించే ముందే వాటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్లలోకి పంపి, శుద్ధి చేసి చెరువులోకి వదిలితే సీవరేజీ తీవ్రత తగ్గే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. గెటెడ్ కమ్యూనిటీ, విల్లాలు, అపార్ట్‌మెంట్ల నుంచి సీవరేజీ వాటర్ వస్తున్నట్లు గుర్తిస్తే, సదరు భవనం యజమానులకు గానీ, ఫ్లాట్స్ అసోసియేషన్ వారికి కూడా చెరువులోకి మురుగు నీరు రాకుండా చూడాలని సూచించాలని ఆదేశించినట్లు సమాచారం. భారీగా మురుగు నీరు చేరే చెరువుల పక్కనే ఉన్న గెటెడ్ కమ్యూనిటీ, విల్లాలు, అపార్ట్‌మెంట్లు విధిగా సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా భవన నిర్మాణ నియమావళిలో కఠినమైన సవరణలు తీసుకురావాలన్న విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో మరోసారి చర్చలు జరిపి, అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.