ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్…మాజీ ఎమ్మెల్యే కు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి సారి ఓ రాజకీయ నేతకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దిశ, జూబ్లీహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి సారి ఓ రాజకీయ నేతకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే , బి ఆర్ ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. సోమవారం చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన అనారోగ్య కారణంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం అందించారు మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక నిందితుడితో సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానం తో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు సమన్లు ఇచ్చారు. ఆయన తర్వాత మరికొంత మంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ లో సంప్రదింపులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతన్నతో లింగయ్య ఫోన్లు చేశారని గుర్తించారు. ఈ విషయం పై విచారించేందుకు లింగయ్య కు పోలీసులు నోటీసులు పంపారు.