చిక్కడపల్లిలో బండరాయితో మోది ఒకరి హత్య..
బండరాయితో మోది ఒకరిని హత్య చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ, ముషీరాబాద్: బండరాయితో మోది ఒకరిని హత్య చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఇన్ స్పెక్టర్ ఎన్.సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి వివేక్ నగర్ హనుమాన్ దేవాలయం సమీపంలో ఫుట్ పాత్ పై ఉంటున్న కుంటి శ్రీను (30), పొట్టకూటి కోసం యాచకుడిగా ఉంటున్నాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గాఢనిద్రలో ఉన్న కుంటి శ్రీను తలపై బండరాయితో మోదీ హత్య చేశారు.
ఉదయం 6 గంటల నుంచే పెద్ద సంఖ్యలో హనుమాన్ దేవాలయానికి భక్తులు రావడంతో వెంటనే గమనించిన కొందరు 100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసుస్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎన్. సంజయ్ కుమార్, ఎస్ఐలు సందీప్ కుమార్, శ్రీనివాస్ రెడ్డిలు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు సంబంధించి వివరాల గురించి ఆరా తీశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తుల సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని సీఐ వివరించారు.
కాగా సీసీ ఫుటేజ్ ఇతర ఆధారాలను సేకరిస్తున్నామని, క్లూస్ టీంను రంగంలోకి దించడం జరిగిందని వివరించారు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ ఇతర ప్రాంతాలలో గాలిస్తున్నామన్నారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి పర్యవేక్షణలో సీఐ ఎన్. సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.