గ్రేటర్‌లో వ్యూహం.. ప్రతి వ్యూహం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యే టికెట్లు ఖరారైన అభ్యర్థులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు మార్గాలను అన్వేషించడంలో నిమగ్నమై ఉన్నారు.....

Update: 2023-11-08 02:42 GMT

దిశ, సిటీ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యే టికెట్లు ఖరారైన అభ్యర్థులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు మార్గాలను అన్వేషించడంలో నిమగ్నమై ఉన్నారు. అభ్యర్థులు తమకు అనుకూలంగా వ్యూహాల్ని, ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని 15 అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఖరారు చేయగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొన్ని సీట్లకు ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎ‌స్, బీజేపీకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఎలక్షన్ స్ట్రాటెజీని సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా తన గెలుపుతో పాటు ప్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలన్న కోణాల్లో ఎన్నికల సమీకరణలు తయారు చేస్తున్నట్లు సమాచారం.

మిగిలిన ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో చాలా మంది ఇంకా నామినేషన్లు కూడా సమర్పించలేదు. సమర్పణకు ఇంకా సమయం ఉందని కొందరు చెబుతుండగా, మరి కొందరు జాగ్రత్తగా నామినేషన్ దాఖలు చేస్తే ఓ పనైపోతుంది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటర్ల మధ్యకు వెళ్లి వారిని ఆకర్షితులను చేసుకునే పనిలో అధికార పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారని చెప్పవ చ్చు. అధికార పార్టీకి సంబంధించి టికెట్లు ముందుగానే ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేసుకుంటూ ఓటర్లను ఆకర్షితులను చేసుకునే పనిలో ఉండగా, మజ్లిస్ పార్టీకి సంబంధించి నాంపల్లి, కార్వాన్, చార్మినార్, బహద్దూర్‌పురా, యాకత్‌‌పురా, మలక్ పేట, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఇటీవలే అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. నాంపల్లి వంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే చాప కింద నీరుగా కాంగ్రెస్ నాయకులు గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రచారానికి బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక మజ్లిస్ అభ్యర్థులకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌ను అధిష్టానమే ఖరారు చేయాల్సి ఉన్నందున అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా 15వ తేదీ తర్వాత అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మాస్ ఓటర్లే టార్గెట్‌గా..

చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు నియోజకవర్గంలోని బస్తీలు, మురికివాడల్లోని మాస్ ఓటర్ల ఆకట్టుకునేందుకు వినాయక చవితి, దసరా పండగలను చాలా బాగా వినియోగించుకోగా, రానున్న దీపావళి పండుగను కూడా సద్వినియోగం చేసుకునేందుకు స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులు నియోజకవర్గంలోని మురికివాడలు, బస్తీలు, కాలనీలుగా విభజించి ఏ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కడున్నారన్న విషయాన్ని పార్టీ క్యాడర్‌తో స్టడీ చేయిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ కొందరు అభ్యర్థులు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తన సామాజికవర్గానికి చెందిన వారిని గుర్తించి, పార్టీలకు అతీతంగా వారితో తరుచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకే సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉండే బస్తీలు, మురికివాడలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓ దఫా బస్తీలు, మురికివాడల పంచాయతీ కమిటీలు, కుల సంఘాలతో అభ్యర్థులు సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మజ్లిస్ తన సిట్టింగ్ స్థానాల్లోని ముస్లిమేతర వర్గాల ప్రజలను కూడా కలిసి వారి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నట్లు సమాచా రం. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు ఇదే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిసింది. నగరంలోని చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ తప్పని పరిస్థితి నెలకొన్నందున మూడో స్థానంతో సరిపెట్టుకుంటూ వచ్చిన పార్టీల నేతలకు ప్రత్యర్థ పార్టీల అభ్యర్థులు గాలం వేస్తున్నట్ల తెలుస్తోంది.

Tags:    

Similar News