అత్యాధునికంగా `ముక్తి` ఘాట్.. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 

Update: 2022-02-05 11:58 GMT

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : నాగోల్ డివిజన్ ప‌రిధిలోని ఫతుల్లా గూడలో దాదాపు 6 ఎకరాల స్థ‌లంలో `ముక్తి` ఘాట్  పేరిట మూడు మతాలకు సంబంధించిన "వైకుంఠదామా"లు  అందుబాటులోకి రాబోతున్నాయ‌ని ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. వీటిని రూ.21 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. శ్మ‌శాన‌వాటిక నిర్మాణ ప‌నుల‌ను ఆయ‌న‌ శ‌నివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ప‌నుల‌ గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స‌ధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల వారికి 2 ఎకరాల చొప్పున వేర్వేరు ద్వారాలు కలిగి ఉండే ఈ ముక్తి ఘాట్లో 20 శాతం మాత్రమే నిర్మాణాలు చేప‌ట్టామ‌న్నామని అన్నారు. మిగతా భాగమంతా పచ్చదనంతో అహ్లాద‌భ‌రితంగా ఉంటుంద‌న్నారు. అన్ని మతాల వారు వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామ‌న్నారు.

ముస్లిం, క్రైస్తవ మతస్తుల వారి ఆచారాలకు అనుగుణంగా ప్రార్థనలు జరుపుకోవడానికి ప్రత్యేక హల్ నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా హిందు శ్మశానంలో సౌండ్ పొల్యూషన్ లేకుండా బ్యాండ్  నిషేధం విధించామ‌న్నారు. అంత్యక్రియల్లో క‌ట్టెల‌కు బదులుగా ఎలక్ట్రిక్ పరికరాలు ఏర్పాటు చేశామ‌న్నారు. అస్థికలను భద్రపరుచుకునే సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు. బ్రహ్మాణులకు అంత్యేష్టి కార్యక్రమాలకు వీలుగా అపరకర్మల భవనం కూడా నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ఒక్కో మతానికి రెండు చొప్పున ఆరు ఫ్రీజర్లు, మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాల ఏర్పాటు, ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్, ఘాట్ చుట్టూ ఎత్తైన చెట్లు ఉండనున్నాయని వివ‌రించారు.


అంత్యక్రియలను ప్రత్యక్షంగా వీక్షించే సదుపాయం, స్నానవాటిక, విశ్రాంతి గదుల్లో నీటిని తిరిగి వినియోగించుకునేలా 0.2 ఎంఎల్టీ మురుగునీటి శుద్ధి కేంద్రం, ఉద్యానవనం, ల్యాండ్ స్కేపింగ్, అలంకరణ, పూలమొక్కలతో సుందరీకరణ లాంటివి ఈ "వైకుంఠ ధామం"లో ఏర్పాటు చేయడం ఈ ముక్తి ఘాట్ ప్ర‌త్యేక‌త‌ల‌ని వెల్ల‌డించారు. వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాగోల్ డివిజన్ మాజీ అధ్యక్షులు సతీష్ యాదవ్, మధుసాగర్, సుమంత్, పాల్వాయి భూపాల్ రెడ్డి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News