ఎమ్మెల్యే కాలేరు అంబర్‌పేటకు చేసిందేమీలేదు.. వి.హనుమంతరావు
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్‌పేటకు చేసిందేమీ లేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు.
దిశ, ముషీరాబాద్ : ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్‌పేటకు చేసిందేమీ లేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. అంబర్‌పేట ఎంసీహెచ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన వాకర్స్మీట్లో వి.హనుమంతరావు పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్‌రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు విషయంలో అంబర్‌పేట నియోజకవర్గంలో అవినీతి జరిగిందని, దళిత బంధులో 30శాతం, డబుల్బెడ్రూమ్ ఇండ్లలో ఎమ్మెల్యే 30శాతం కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అంబర్‌పేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి.రోహిన్‌రెడ్డికి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబర్‌పేటలో కాంగ్రెస్‌పార్టీ చేపడుతున్న ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. అంబర్‌పేట గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమావ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అందుకే ప్రజలు ఆలోచించి తమ విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గడప గడపకు పాదయాత్ర...
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిన్‌రెడ్డి సోమవారం సాయంత్రం కాచిగూడ డివిజన్పరిధిలోని పలు బస్తీలలో ఇంటింటికి పాదయాత్ర నిర్వహించి ప్రజలకు కాంగ్రెస్‌పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను వివరించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసయాలని ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే అంబర్‌పేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా అభ్యర్థి రోహిన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.