చెరువులను కబ్జా చేస్తుంటే అన్ని శాఖలు చోద్యం చూస్తున్నాయి : ఎమ్మెల్యే గాంధీ
గంగారం పెద్ద చెరువు కబ్జాలకు అడ్డాగా మారిందని, కొందరు కబ్జాదారులు

దిశ, శేరిలింగంపల్లి : గంగారం పెద్ద చెరువు కబ్జాలకు అడ్డాగా మారిందని, కొందరు కబ్జాదారులు గంగారం పెద్ద చెరువులో 5 ఎకరాల మేర మట్టిని పోసి ఆక్రమణకు యత్నిస్తున్నారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ఆరోపించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నాలుగు చెరువుల సుందరీకరణ లో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. చెరువుల సుందరీకరణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పనులు కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. అయితే కొందరు కబ్జాదారులు మాత్రం చెరువులు, కుంటలను కబ్జాలకు పాల్పడుతున్నామని అన్నారు.
గంగారం పెద్ద చెరువులో కొందరు వ్యక్తులు సెక్యూరిటీ సిబ్బంది ఉండగానే 5 ఎకరాల విస్తీర్ణంలో చెరువును కబ్జా చేశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఇరిగేషన్ సిబ్బందికే తెలియాలని అన్నారు. తాను చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదని, వాస్తవాలు అని, గంగారం పెద్ద చెరువు దగ్గరకు వెళ్లి చూస్తే ఎవరికైనా కనిపిస్తాయని అన్నారు. చెరువులు, కుంటలు పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతుంటే రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా శాఖలు ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అధికారులను ప్రశ్నించారు. గతంలోనూ గంగారం పెద్ద చెరువులో చోటుచేసుకుంటున్న కబ్జాలపై ఎమ్మెల్యే గాంధీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలకు ఆదేశించారు.