అంగన్‌వాడీల వెనక అతీత శక్తులు.. మంత్రి సత్యవతి సంచలన వ్యాఖ్యలు
రాష్టంలోని అంగన్వాడీ కార్మికులు చేస్తున్న సమ్మె వెనుక అతీత శక్తుల ప్రమేయంతోనే కొనసాగుతుందని స్త్రీ , శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు..
దిశ , తెలంగాణ బ్యూరో: రాష్టంలోని అంగన్వాడీ కార్మికులు చేస్తున్న సమ్మె వెనుక అతీత శక్తుల ప్రమేయంతోనే కొనసాగుతుందని స్త్రీ , శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కొందరు ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. అంగన్వాడీ కార్మికులు చేస్తున్న సమ్మెపై స్పందించిన మంత్రి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత సమ్మె చేయడం కరెక్ట్ కాదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు రెగ్యులర్ చేయాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడమనేది కష్టమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అంగన్ వాడీల తరుపున లేఖ రాస్తామని తెలిపారు. అవసరమైతే తాము స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి అప్పీల్ చేస్తామన్నారు. అంగన్వాడీలు వెంటనే విధుల్లోకి చేరాలని ఆమె కోరారు.
సమాజంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువ మంది బలహీన వర్గాల వారే ఉన్నారని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని అంగన్వాడిల సర్వీస్‌ను కొనసాగించాలని మంత్రి సత్యవతి ఆదేశించారు . దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. . అంగన్వాడీలు వాస్తవాలను గ్రహించి వెంటనే విధులకు హాజరుకావాలని తెలిపారు . అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.