SNDP పనులకు మంత్రి KTR డెడ్ లైన్..

మహానగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు మునకకు గురయ్యే ప్రాంతాలను కాపాడేందుకు సర్కారు ఎస్ఎన్‌డీపీ కింద చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మరో డెడ్‌లైన్‌ను ప్రకటించారు.

Update: 2022-12-07 02:46 GMT

దిశ, సిటీబ్యూరో: మహానగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు మునకకు గురయ్యే ప్రాంతాలను కాపాడేందుకు సర్కారు ఎస్ఎన్‌డీపీ కింద చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మరో డెడ్‌లైన్‌ను ప్రకటించారు. రెండేళ్ల క్రితం భారీ వర్షాలు కురిసి నగరంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఆయా ప్రాంతాల పరిరక్షణ కోసం ఎస్ఎన్‌డీపీ పనులకు శ్రీకారంచుట్టిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ ఇంజినీర్లు గ్రేటర్ పరిధిలో, గ్రేటర్ బయటున్న స్థానిక సంస్థల్లో మొత్తం 42 పనులను చేపట్టగా, వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం రెండు పనులు మాత్రమే పూర్తి చేశారు.

గత వర్షాకాలం రాకముందే పనులను పూర్తి చేయాలంటూ మంత్రి డెడ్‌లైన్ విధించినా, ఇంజినీర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం వర్షాకాలం ముగిసేలోపైనా పనులు పూర్తి చేయాలని మంత్రి అల్టిమేటమ్ జారీ చేసినా, ఫలించలేదు. చివరకు మళ్లీ వర్షాకాలం వచ్చే లోపైనా పనులు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారే తప్ప, పనుల్లో ఎందుకు ఆలస్యమవుతుందన్న విషయాన్ని ఆరా తీయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీతో పాటు దాదాపు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు ఎస్ఎన్‌డీపీ పనులపై తీవ్రస్థాయిలో ఇంజినీర్లను ప్రశ్నించటంతో డిసెంబర్ నెలాఖరుకల్లా పనులన్నీ పూర్తి చేస్తామని ఇంజనీర్ ఇన్ చీఫ్ జియావుద్దీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఎల్బీనగర్ జోన్‌లో సుమారు రూ.54 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ విధించిన డెడ్‌లైన్‌లోపు పనులు కావన్న సంకేతాలిచ్చారు.

మంత్రి కనీసం రానున్న వర్షాకాలంలో పైన పనులు పూర్తి చేయాలని ఆదేశించటంతో అధికారులు మరింత బేఫికర్‌గా ఉంటారన్న వాదనలున్నాయి. తీరా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత గత సంవత్సరం మాదిరిగానే కనీసం వర్షాకాలం పూర్తయ్యే లోపు పనులు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ మళ్లీ ఆదేశిస్తారా? లేక పనులెందుకు కాలేదంటూ నిలదీస్తారా? అసలు ఈ ఛాన్స్ బల్దియా ఇంజినీర్లు మంత్రికి కల్పిస్తారా? వేచి చూడాలి.

రెండు దశాబ్దాలుగా ఇదే ప్రయాస

రెండు దశాబ్దాల క్రితం వరదలు నగరాన్ని ముంచెత్తినప్పుడు అప్పటి ప్రభుత్వం నగరాన్ని శాశ్వతంగా వరదల నుంచి రక్షించేందుకు పరిష్కార మార్గం కోసం కిర్లోస్కర్ కమిటీని నియమించి అధ్యయనం చేయించిన సంగతి తెల్సిందే. నాటి నుంచి నేడు స్వపరిపాలన వరకు ఏ సంవత్సరానికా సంవత్సరం వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ ప్రకటించటం, అది నమ్మిన ప్రజలు ఓ మోస్తారు వర్షానికే నీట మునగటం మామూలై పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగ మంత్రి విధించిన డెడ్‌లైన్ లోపు అకాల వర్షాలు కురిసి ప్రాంతాలు నీట మునిగితే, అక్కడి బాధితులకు అధికారులు ఏం సమాధానం చెబుతారో? సిద్దమై ఉంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read......

'జయహో.. బీసీ మహాసభ'.. బ్యాక్​బోన్​ క్లాస్​ మాతోనే : వైసీపీ

Tags:    

Similar News