మీ(ఈ)టింగ్ మాకు..! బిల్లులు మీకు
అక్రమార్కులను ప్రోత్సహించేదే లేదంటూ ప్రగల్భాలు పలికే పాలకులు జీహెచ్ఎంసీలో మెడికల్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని అవినీతి దిశగా ప్రోత్సహిస్తున్నారా.. అన్న ప్రశ్న తలెత్తుతోంది.
దిశ, సిటీ బ్యూరో: అక్రమార్కులను ప్రోత్సహించేదే లేదంటూ ప్రగల్భాలు పలికే పాలకులు జీహెచ్ఎంసీలో మెడికల్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని అవినీతి దిశగా ప్రోత్సహిస్తున్నారా.. అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వ్యవహారం చూసి అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ నెల 6న జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. అందులో ఎవరి పార్టీ ఆఫీసుల్లో వారు.. లేదంటే హోటళ్లలో నిర్వహించారు. కానీ, అధికార కాంగ్రెస్ మాత్రం ఈ నెల 5న బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ ఫైవ్ స్టార్ హోటల్‌లో నిర్వహించింది.
ఈ సమావేశానికి ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డితో పాటు 19 మంది కార్పొరేటర్లు, వారి పీఏలు, డ్రైవర్లు కార్పొరేటర్ తరఫున మూడు నుంచి నలుగురు హాజరైనట్లు సమాచారం. రాత్రి డ్రింక్స్, డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ మీటింగ్ బిల్లు రూ.10 లక్షలు అయినట్లుగా సమాచారం. సన్నాహక మీటింగ్, అది కూడా తాజ్‌కృష్ణ ఫైవ్ స్టార్ హోటల్‌లో అంటే అందరూ ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు.
పార్టీ ఎండ్‌లో ఆ బిల్లులు ఎవరు చెల్లించాలన్న ప్రశ్న ఉత్పన్నం కాగా, బిల్లులను జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లకు చెందిన 30 మంది మెడికల్ ఆఫీసర్లకు డివైడ్ చేసి చెల్లించాలంటూ పాలక మండలి ఆదేశించినట్లు సమాచారం. ఒక్కో మెడికల్ ఆఫీసర్‌కు రూ.34 వేలకుపైగా పడినట్లుగా తెలుస్తోంది. కానీ, 30 సర్కిళ్లకు 30 మంది మెడికల్ ఆఫీసర్లు లేరు. కేవలం18 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వారు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. పార్టీ మీటింగ్ ఖర్చు తామెందుకు చెల్లించాలని కొందరు మెడికల్ ఆఫీసర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు భరించక తప్పుతుందా అనునుకుంటున్నట్లుగా వినికిడి
బడా హోటళ్లకు టచ్‌లో..
మహా నగరంలోని బడా ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్వాహకులకు స్థానిక సర్కిల్ మెడికల్ ఆఫీసర్ టచ్‌లో ఉంటారా.. అన్న ప్రశ్నకు ఈనెల 5న తాజ్ కృష్ణాలో జరిగిన కాంగ్రెస్ సన్నాహక సమావేశమే నిదర్శనం. కాంగ్రెస్ కార్పొరేటర్ల సన్నాహక సమావేశానికి సంబంధించి హోటల్ బిల్లు ఇంకా చెల్లించకపోయినా హోటల్ నిర్వాహకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..? లేక మెడికల్ ఆఫీసర్ల సమావేశం జరిగిన మరుసటి రోజే చెల్లించారా.. అన్నది తెలియాల్సి ఉంది. గతంలో కూడా పలు బిల్లులకు సంబంధించి మేయర్ ఆఫీసు పలు రకాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెల్సిందే.