ఛాయ్ లో కలిపి తాగితే...ఈ పాపీ స్ట్రా డ్రగ్ మత్తు కిక్కు 8 గంటలు..
హైదరాబాద్ లో పాపీ స్ట్రా డ్రగ్స్ ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న రాజస్థాన్ కు చెందిన ముగ్గురిని సోమవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో పాపీ స్ట్రా డ్రగ్స్ ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న రాజస్థాన్ కు చెందిన ముగ్గురిని సోమవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన మంగీలాల్ బిష్ణోయ్ , మంగిలాల్ ఢాకా, భీరా రాం లు హైదరాబాద్ కు వలస వచ్చి నాదర్ గుట్ అశోక్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. రెయిలింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ఆదాయం సరిపోక పోవడంతో డ్రగ్స్ దందా చేసి డబ్బు సంపాదించాలని స్కెచ్ వేశారు. దీని కోసం మధ్యప్రదేశ్ కు చెందిన పింటూ అలియాస్ మోహన్ సింగ్ ను సంప్రదించారు. పింటూ దగ్గర తక్కువ ధర లో కొనుగోలు చేసి నగరంలో అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఈ ముగ్గురు దాదాపు 53.3 కేజీల పాపీ స్ట్రా డ్రగ్స్ ను మధ్య ప్రదేశ్ నుంచి నాదర్ గుల్ ప్రాంతానికి తీసుకువస్తున్నారని సమాచారం అందుకున్న ఎస్ఓటీ, మీర్ పేట్ పోలీసులు కలిసి ముగ్గురిని అరెస్టు చేసి దాదాపు 1.25 కోట్లు విలువ చేసే పాపీ స్ట్రా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఛాయ్ , పాలు, నిమ్మరసం, నీళ్ళలో కలుపుకుని ఈ డ్రగ్స్ ను సేవిస్తే మత్తులోకి జారుకుంటారు. ఈ మత్తు దాదాపు 7 నుంచి 8 గంటల పాటు ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది. ఈ పాపీ స్ట్రా డ్రగ్స్ ను బయట అమ్మడం నిషేధమని పోలీసులు తెలిపారు. టీజీ న్యాబ్ తో పాటు రాష్ట్రంలో పోలీసులు అందరూ గంజాయి, మాదకద్రవ్యాల రవాణాపై నిఘా ను పెంచడంతో ఈ ముగ్గురు పాపీ స్ట్రా డ్రగ్స్ అక్రమంగా తీసుకువచ్చి మత్తు దందా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తేలింది. వీరి వద్ద నుంచి ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసే వారికి కూడా గుర్తించామని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. గంజాయి, ఇతర డ్రగ్స్ నెట్ వర్క్ నుంచి పోలీసులకు సమాచారం అందుతుండడంతో ఇప్పుడు అక్రమ మత్తు దందా చేసే వారు పాపీ స్ట్రా డ్రగ్స్ వైపు మళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మాదకద్రవ్యాల దందాను ఎట్టి పరిస్థితుల్లో సహించేంది లేదని సీపీ హెచ్చరించారు.
డ్రగ్స్, గంజాయి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని డయల్ 100 ద్వారా తెలపాలి అని సీపీ కోరారు. పట్టుబడిన నిందితులు గతంలో కూడా హెరాయిన్ ను స్మగ్లింగ్ కు పాల్పడినప్పుడు హాయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ఈ డ్రగ్స్ ను పట్టుకున్న ఎస్ఓటీ, మహేశ్వరం పోలీసులను సీపీ అభినందించారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ ను ఓపియం(గసగసాలు) వచ్చిన తర్వాత ఆ చెట్టు నుంచి తీసే పదార్థమే పాపీ స్ట్రా డ్రగ్ గా పిలుస్తారని పోలీసులు చెప్పారు. నూతన సంవత్సరాల వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్ధాల సరఫరా తో పాటు ఆ దందా చేసే ముఠాల పై గట్టి నిఘా పెట్టామని సీపీ తెలిపారు.