జర్నలిస్టులందరికి 'జర్నలిస్ట్ బంధు' ఇవ్వాలి : Mandakrishna Madiga
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి స్వరాష్ట్ర సాధనలో భాగస్వాములైన జర్నలిస్టులకు కులం, మతంతో సంబంధం లేకుండా ఆదుకోవాలని, రైతుబంధు, దళిత బంధు తరహాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా 'జర్నలిస్టు బంధు' ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.
దిశ, ముషీరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి స్వరాష్ట్ర సాధనలో భాగస్వాములైన జర్నలిస్టులకు కులం, మతంతో సంబంధం లేకుండా ఆదుకోవాలని, రైతుబంధు, దళిత బంధు తరహాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా 'జర్నలిస్టు బంధు' ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వం లో సమాచార శాఖ కు ప్రత్యేక మంత్రి, పూర్తి స్థాయి కమీషనర్ లేకపోవడం విచారకరమన్నారు. సమాచార శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉండడం వల్ల జర్నలిస్టు లు, జర్నలిస్టు సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వానికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలోనూ సమాచార శాఖకు ప్రత్యేక మంత్రి ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో సమాచార శాఖను మరో మంత్రికి అప్పగించాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. ఈ అంశాన్ని డిమాండ్ గానో, హెచ్చరిక గానో కాకుండా న్యాయబద్దంగా భావించి సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జర్నలిస్టు సంఘాలతో ప్రతి 6 నెలలకు ఒకసారి జర్నలిస్టుల సమస్యల పై సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరారు. 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జర్నలిస్ట్ సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.