సీఎం కేసీఆర్ దళిత ద్రోహి.. మంద కృష్ణ మాదిగ సీరియస్

Update: 2022-02-07 14:40 GMT

దిశ, ముషీరాబాద్: సీఎం కేసీఆర్ ముమ్మాటికి దళిత ద్రోహి అని, సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన అహంకారపూరితమైన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, వెంటనే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎన్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మందకృష్ణ మాదిగ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీనుంచి మూడ్రోజుల పాటు తెలంగాణాలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామపంచాంయతీ కార్యాలయాల ఎదుట నిరసన కారక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

అంతేగాక, ఈనెల 12వ తేదీన అన్ని పార్టీలు, దళిత సంఘాలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, మేధావుల సలహా మేరకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు గిట్టదని, కేంద్ర ప్రభుత్వంతో ఏడేళ్లుగా సజావుగా ఉంటూ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అనడం దౌర్భాగ్యమని విమర్శించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్-3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం పెట్టిన భిక్షే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ క్రమ శిక్షణ సంఘం చైర్మన్ సత్యం మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ నేతలు లింగస్వామి మాదిగ, కొండూరు రాజేల్లయ్య మాదిగ, జాతీయ నాయకురాళ్లు సుజాత మాదిగ, దుర్గాదేవి, జయపాల్, గౌరమ్మ, రాజు, అరుణ్, విష్ణు, విజయ, భాను, బాలకృష్ణ, జి.వెంకటేష్, రామకృష్ణ, కుమార్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News