బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకం: సీఎం కేసీఆర్

దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి... KCR Speech

Update: 2023-04-04 13:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకమని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత సమాజాభివృద్ధికోసం జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. బుధవారం బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. జగ్జీవన్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉపప్రధాని పదవితోపాటు, పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి ఆయా రంగాల్లో తనదైన ముద్రను, భారతదేశ పురోభివృద్ధికి పునాదులు వేశారన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల ఉన్నతికి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు, కార్మికోద్యమాలు చేశారన్నారు.

కార్మిక పక్షపతి, జీవితాంతం పేదలు, పీడిత వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు. ప్రజలు ప్రేమగా పిలుచుకునే ‘బాబూజీ’ గా ప్రఖ్యాతులయ్యారని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ సామాజికంగా, ఆర్థికంగా వివక్షకు గురైన దళితుల సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నదన్నారు. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దళిత సంక్షేమ మోడల్ గా, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

Tags:    

Similar News