ఆ ప్రమాదం దిగ్భ్రాంతికరం.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: Pawan Kalyan
నాంపల్లి అగ్నిప్రమాదం దిగ్భ్రాంతికరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: నాంపల్లి అగ్నిప్రమాదం దిగ్భ్రాంతికరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. భవనాల్లో రసాయనాల్లో, ఇంధనాలు నిల్వ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందన్నారు. నివాస ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు.
కాగా నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ కంపెనీ గోదాంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ నాలుగో అంతస్తుకు చెలరేగడంతో అందులో ఉన్న కార్మికులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది 7 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. కంపెనీ వద్ద ఉన్న ఓ కారు, బైక్లు మంటల్లో కాలిపోయాయి. డీజిల్ డ్రమ్ములు పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.