వినాయక విగ్రహాల పంపిణీలో అక్రమాలు.. పంపిణీ లక్షల్లో.. ఖర్చు మాత్రం కోట్లలో..

Update: 2023-03-06 14:35 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేవుని పేరిట కూడా ప్రభుత్వ నిధులు లెక్కలేకుండా ఖర్చవుతున్నాయి. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆది దేవుడైన వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ఖర్చు కూడా తడిసి మోపెడౌతోంది. పండుగను పురస్కరించుకుని బల్దియా నగర ప్రజలకు అందజేసే గణేష్ విగ్రహాల విషయంలో కూడా అధికారులు చేస్తున్న ఖర్చు వాస్తవ విరుద్ధాలుగా ఉంటున్నాయి. నవరాత్రుల సందర్భంగా వారు గ్రేటర్ ప్రజలకు సరఫరా చేసే విగ్రహాల లెక్కలు కూడా అనుమానాస్పదంగా ఉంటున్నాయి.


ప్రతి యేటా వినాయక చవితి సందర్భంగా.. నగర ప్రజలకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత యేడాది జీహెచ్ఎంసీ లక్షలలో విగ్రహాలు సరఫరా చేయగా.. ఖర్చు మాత్రం కోట్లలో ఉంది. వినాయక నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఆ మట్టి విగ్రహాలు ఎక్కడ పంపిణీ చేశారో..? ఎవరికి ఇచ్చారో..? ఎన్ని తయారు చేశారో..? వంటి లెక్కలు మాత్రం ఇచ్చేందుకు అధికారులు ముందుకు రాలేదు.

అధికారుల లెక్కలకు అర్ధాలే వేరులే..

గత సంవత్సరం 2022 వినాయక చవితిని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ వ్యాప్తంగా విగ్రహాల పంపిణీకి ఖర్చు చేసిన వివరాలను ఇవ్వాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరింది. జిహెచ్ఎంసీ పరిధిలో వినాయక చవితి సందర్భంగా మొత్తం 8 అంగుళాల విగ్రహాలు 2.60 లక్షలు కాగా, అందులో ఒక్క అడుగు విగ్రహాలు రూ. 30 వేలు, 1.5 అడుగుల విగ్రహాలు రూ. 10 వేలు ఉన్నాయి.

గత సంవత్సరం జిహెచ్ఎంసీ కి గణేష్ విగ్రహాల సరఫరా, డెలివరీ కోసం మొత్తం రూ. 1,54,24,000 ఖర్చు చేయగా.. వినాయక నిమజ్జనానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ప్రశ్నించినా ఖర్చు వివరాలు మాత్రం ఇవ్వలేదని సంస్థ ఫౌండర్ పల్నాటి రాజేంద్ర వివరించారు. అయితే నవరాత్రులకు జరిగిన ఖర్చు మాత్రం పూర్తిగా తమ సెక్షన్ ద్వారా డీల్ చేయబడలేదని బల్దియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు.

నివృత్తి చేయాలి..

వినాయక నిమజ్జన ఖర్చును ప్రజలకు బహిరంగంగా తెలపాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. 2022 లో చేసిన ఖర్చు వివరాలను ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థ కోరినప్పటికీ అధికారులు పూర్తి వివరాలు ఇవ్వక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. లెక్కలు పారదర్శకంగా ఉంటే వివరాలు ఇవ్వడం లో ఇబ్బందులేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఐ కింద కోరిన పూర్తి సమాచారం ఇవ్వకపోవడం తో పలు అనుమానాలకు తావిస్తోందని. నిమజ్జనం ఖర్చు తమ పరిధిలోకి రాదని దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బల్దియా చేసిన ఖర్చు వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News