తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారాలకు ఆహ్వానం
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనలను ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు... Invitation for Telugu University Literary Awards
దిశ, అంబర్ పేట్: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనలను ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తున్నదని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తెలిపారు. 2021 సంవత్సరానికి ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు పాఠకులు, రచయితల నుండి విశ్వవిద్యాలయం సూచనలు కోరుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రక్రియల్లో 2018 జనవరి నుండి 2020 డిసెంబర్ మధ్య కాలంలో తొలిసారిగా ప్రచురణ పొందిన గ్రంథాల్లో పాఠకులు ఉత్తమంగా భావించిన గ్రంథాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని వివరించారు. రచయిత మరణించినప్పటికీ వారి రచనలు 2018 జనవరి నుండి 2020 డిసెంబర్ మధ్య కాలంలో ప్రచురణ పొంది ఉంటే పరిగణంలోకి తీసుకుంటామని చెప్పారు. వచన, పద్య కవితలతోపాటు బాల సాహిత్యం, నవల, కథానికల సంపుటి, నాటకం, నాటికల సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం అనే 10 ప్రక్రియల్లో అన్ని ప్రక్రియలలో కొన్నింటికి తమకు నచ్చిన గ్రంథాలను పురస్కారాలకు సూచించవచ్చని తెలిపారు.
సూచనలో ప్రక్రియ పేరు, గ్రంథం పేరు, రచయిత పేరు, చిరునామా, పేజీల సంఖ్య, ప్రచురణ సంవత్సరం, ప్రచురణకర్త పేరు పేర్కొన్నాలన్నారు. అనువాద సాహిత్య విభాగానికి తప్ప మిగతా విభాగాలకి అవార్డుల కోసం అనువాదాలు, అనుసరణలు ఆమోదింపబడవని తెలిపారు. వచన రచన అనే ప్రక్రియలో సామాజిక, ఆర్ధిక, తాత్త్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర, దేశ చరిత్ర, సంస్కృతి, కళలకు సంబంధించిన గ్రంథాలు సూచించవచ్చన్నారు. అన్ని ప్రక్రియల్లోనూ "ప్రామాణికమైన మౌలిక గ్రంథాలనే సూచించాలని, కవితా సంపుటులయితే కనీసం 60 పేజీలు, మిగతా ప్రక్రియల్లో గ్రంథాలు 96 పేజీలకు తగ్గరాదన్నారు. తమ దరఖాస్తులను రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు- 500004 చిరునామాకు మార్చ్ 20 తేదీలోగా పంపించాలని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ కోరారు.