2024 లో జైలుకు పెరిగిన రద్దీ...
మావోయిస్టు, టెర్రరిస్టు వ్యవహారాల్లో అరెస్టై జైలుకు వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గిందని, రాష్ట్రంలో ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా అన్నారు.
దిశ, సిటీక్రైం : మావోయిస్టు, టెర్రరిస్టు వ్యవహారాల్లో అరెస్టై జైలుకు వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గిందని, రాష్ట్రంలో ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా అన్నారు. బుధవారం చంచల్ గూడ జైలు కేంద్ర కార్యాలయంలో డీజీ సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ ఉన్నతాధికారులతో కలిసి 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025 లో రాష్ట్రంలోని అన్ని జైళ్లను గ్రీన్ ప్రిసన్స్ గా మారుస్తామన్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల లో దాదాపు 530 కిలో వాట్స్ సోలార్ పవర్ ను వినియోగిస్తున్నామన్నారు. దీని వల్ల 20 శాతం విద్యుత్ బిల్లు ఆదా చేశామన్నారు. అదే విధంగా కొత్తగా హైదరాబాద్, చర్ల పల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ జైళ్లలో డీ అడిక్షన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలకు బాని సై నేరాలకు పాల్పడి జైలుకు వచ్చిన వారికి ఈ కేంద్రాల్లో కౌన్సెలింగ్ ను ఇచ్చి వారిలో మార్పునకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ , గంజాయి, ఇతర మాదకద్రవ్యాల పై కఠినంగా ఉండడంతో 2024 లో ఎన్ డీపీఎస్ కేసులలో అరెస్టై జైలుకు వచ్చిన వారి సంఖ్య పెరిగిందన్నారు. అదే విధంగా జైలుకు వివిధ నేరాలు చేసి వస్తున్న ఖైదీల డాటాను భద్రంగా ఉంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు.
దీనికి ఆధార్ తో అనుసంధానం చేస్తున్నామన్నారు. ఎవరికైతే ఆధార్ లేదో వారికి జైలులోనే ఆధార్ పొందేలా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి ఒక రోజు ఆధార్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జైళ్ల శాఖ సిబ్బంది, అధికారులు నిర్వహించిన విధులతో జైలు నుంచి పరారీ సంఘటనలు అసలు నమోదు కాలేదన్నారు. అదే విధంగా ఒక ఆత్మహత్య సంఘటన చోటు చేసుకోలేదన్నారు. ఓ హత్య కేసులో నిందితుడైన మహబుబాద్ ప్రాంతానికి చెందిన ఎస్.వీరన్నను 40 ఏండ్ల తర్వాత తిరిగి పట్టుకున్నామని తెలిపారు. పెరోల్ మీద బయటికి వెళ్ళిన 7 మందిలో 4 గురు ఆ నిబంధనలను ఉల్లంఘించి తప్పించుకుని తిరుగుతుండగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి వారందరీని తిరిగి జైలుకు తీసుకువచ్చామని డీజీ పేర్కొన్నారు. 552 ఖైదీలకు 1.73 కోట్ల ను అప్పుగా ఇచ్చాం. 2650 మంది ఖైదీలకు నైపుణ్యతకు సంబంధించిన కోర్సులలో శిక్షణను ఇప్పించామని సౌమ్య మిశ్రా వివరించారు. ఖైదీల్లో 750 మంది డిగ్రి, 225 మంది పీజీ పట్టాలను అందుకున్నారు. నుమాయిష్(ఎగ్జిబిషన్ ) లో తెలంగాణ జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ కు ఉత్తమ బహుమతి లభించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఖైదీల భావోద్వేగాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఈ-ములాఖత్ ల ద్వారా మొత్తం 2000 మందికి వారి కుటుంబాలతో మాట్లాడేందుకు సౌకర్యం కల్పించామన్నారు. కమాండ్ కంట్రోల్ తో అన్ని జైళ్ల భద్రతను పటిష్టంగా నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. జైళ్లలో ఉన్న ఖైదీల్లో సత్పర్తనను తీసుకువచ్చి వారిని తిరిగి సమాజంలో ఆనందంగా జీవించే విధంగా జైళ్ల శాఖ చేస్తున్న క్రుషిని అందరికి తెలిసేలా త్వరలోనే జైలు మ్యూజియంను ప్రారంభిస్తామని డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. జైలు అదాలత్ ద్వారా 1932 కేసులను పరిష్కరించి 483 మందిని విడుదల చేశామన్నారు. థంబ్ ఇన్ సైన్ ఔట్ కింద 12650 మంది ఖైదీలను విద్యావంతులుగా తీర్చిదిద్దామన్నారు. క్షమాభిక్ష కింద ప్రభుత్వం 2024లో మొత్తం 213 మందిని జైలు నుంచి విడుదల చేసింది. దీంట్లో 35 మంది మహిళలు ఉన్నారు. విడుదలైన వీరిలో 67 మంది పురుషులు, 3 మహిళలకు వారికి జైళ్ల శాఖ నిర్వహిస్తున్న మై నేషన్ పెట్రోల్ పంప్ లలో పని చేసే విధంగా వారి అపాయింట్మెంట్ లెటర్ లు ఇచ్చి ఉద్యోగాలను కల్పించామని డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. ఈ సమావేశంలో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
2024లో వివిధ నేరాల పై జైలుకు వచ్చిన ఖైదీల వివరాలు ఇలా....
అండర్ ట్రయల్ ఖైదీలు -- 30,153, పురుషులు = 27882, మహిళలు = 2249, ఇతరుల = 22
కన్విక్షన్ పై వచ్చిన ఖైదీలు -- 3572, పురుషులు = 3392, మహిళలు = 179, ఇతరులు = 1
ప్రమాదకరమైన క్రిమినల్స్ (డిటెన్స్యూస్) -- 26, పురుషులు = 25, మహిళలు = 1..
సివిల్ కేసులు -- 13, పురుషులు = 13
30 ఏండ్ల లోపు జైలుకు వచ్చిన వారు --18,855, పురుషులు = 18,266, మహిళలు = 572, ఇతరులు = 17
పోక్సో కేసులు -- 3750, పురుషులు = 3655, మహిళలు = 94, ఇతరులు = 1
ఎన్ డీపీఎస్ కేసులు -- 6311, పురుషులు = 5999, మహిళలు = 312,
డ్రగ్స్ కు బానిసైన వారు -- 106, పురుషులు = 102, మహిళలు = 4
మావోయిస్టులు/టెర్రరిస్టు కేసులు -- 36, పురుషులు = 31, మహిళలు = 5
హత్య కేసులు -- పురుషులు 405, మహిళలు - 1
2023 లో 31428 మంది జైలుకు రాగా ఈ ఏడాది 41,138 మంది ఈ ఏడాది జైలుకు వివిధ కేసులలో వచ్చారని జైలు అధికారులు తెలిపారు.