నేడు బోనమెత్తనున్న భాగ్యనగరం.. 600 మంది పోలీసులు,150 సీసీ కెమెరాలతో నిఘా!

గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలకు అంతా సిద్ధమైంది.

Update: 2024-07-07 03:14 GMT

దిశ, మెహిదీపట్నం: గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలకు అంతా సిద్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నిర్వహించే తొలి బోనానికి సంబంధించి సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు, పోలీసు శాఖ భావిస్తుంది. గోల్కొండ కోటలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జలమండలి అధికారులు మంచినీటి సరఫరాకు పాయింట్లు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు చెత్త తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండ కోటలో మెడికల్ సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారు.

తెల్లవారుజామున పచ్చికుండలతో..

ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు రెండు పచ్చి కుండలతో కులవృత్తులకు సంబంధించిన నాయకుడు శంకర్ అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. గోల్కొండలోని ఫతేదర్వాజాలో ఉన్న పూజారి సర్వేశ్ కుమార్ ఇంట్లో నుంచి జగదాంబికా అమ్మవారి ఉత్సవమూర్తులను మధ్యాహ్నం సమయంలో ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. గోల్కొండ ఆలయ అమ్మవారి కులవృత్తుల సంఘం అధ్యక్షుడు బొమ్మల సాయిబాబా చారి నివాసం నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించనున్నారు. వందమంది పోతురాజులతో ఐరావతంపై ఊరేగించుకుంటూ తీసుకెళ్లనున్నట్లు శ్రీకాంత్ చారి తెలిపారు. సాయిబాబా చారి నివాసం వద్ద 1000 మందికి అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

పటిష్ట బందోబస్తు..

సుమారు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బందోబస్తులతో పాటు పలు అంశాలకు సంబంధించి ఆయన శనివారం మధ్యాహ్నం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ప్రధానంగా మూడు పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా పార్కింగ్ ప్రాంతాల నుంచి భక్తులను ఉచితంగా గోల్కొండ కోట వరకు తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొట్టమొదటిసారిగా ఉచితంగా ఈ వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 150 సీసీ కెమెరాలతో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోల్కొండ బోనాల వేడుకలకు సంబంధించి డీజేలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. సౌండ్ బాక్సులు భక్తులు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. భక్తులు, ఆలయ కమిటీ, అధికారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పట్టు వస్త్రాల సమర్పణ..

లంగర్ హౌస్ చౌరస్తాలో మంత్రులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. లంగర్ హౌస్ నుంచి తొట్టెల రథం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. లంగర్ హౌస్‌లో అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు గోల్కొండ ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరాజు తెలిపారు.


Similar News