సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం

Update: 2024-10-14 09:07 GMT

దిశ, బేగంపేట: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డ ఆగంతకులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్దకు చేరుకున్న స్థానికులు వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను నిలువరించే ప్రయత్నం చేశారు.

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో ఇది నాలుగో సంఘటన జరగడం బాధాకరమని, హిందూ దేవాలయాలపై విగ్రహాలపై దాడి చేసిన వారు దొంగతనాలు చేయడానికి వచ్చారని, మరికొంతమంది మతిస్థిమితం లేకుండా దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి : బీజేపీ నాయకురాలు మాధవి లత

సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఉన్న అమ్మవారి గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమని బీజేపీ నాయకురాలు మాధవి లత అన్నారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ల మతం ఇస్లాం అని ఇంత జరిగినా పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. మొదటగా హిందువులకు ఐక్యత ఉండాలని, మనలో మనకే ఐక్యత లేకపోతే ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయని అన్నారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్


మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మోండా మార్కెట్ లోని కుమ్మరిగూడెం లో గల ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆలయంలోకి వెళ్లి పరిశీలించారు. పోలీసు అధికారులు, స్థానికులను ఘటన కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు మత ఘర్షణలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు బతుకమ్మ, దుర్గామాత నవరాత్రులు ఎంతో ఘనంగా, భక్తి శ్రద్దలతో జరుపుకోవడం జరిగిందని, ఇంతలోనే ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు. ఈ ఘటన తో ఒక వర్గం ప్రజలు తమ మనోభావాలను దెబ్బతీసే చర్యగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు, ముగ్గురు వరకు భాగస్వాములు అయినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారని, వారిలో ఒక్కరు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారో పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట మోండా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు నాగులు, మహేందర్, మహేష్, సత్యనారాయణ, అమర్ తదితరులు ఉన్నారు.

సంఘటన స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు

సంఘటన స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, నగర అదనపు కమిషనర్, నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మాల్ తదితరులు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా బీజేపీ నాయకులు మాధవి, చీకోటి జి కోటి ప్రవీణ్ లను అరెస్ట్ చేసి పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ కు తరలించారు .


Similar News