నేటి నుంచి జీఐఎస్ సర్వే.. ఏడు ప్రాంతాల్లో ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ

జీహెచ్ఎంసీ ప్రస్తుత ఇన్‌ఫర్‌మేషన్, టెక్నాలజీని వినియోగించుకుంటూ మరింత మెరుగైన, సురక్షితమైన సేవలందించేందుకు సిద్దమవుతుంది.

Update: 2024-07-30 02:34 GMT

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రస్తుత ఇన్‌ఫర్‌మేషన్, టెక్నాలజీని వినియోగించుకుంటూ మరింత మెరుగైన, సురక్షితమైన సేవలందించేందుకు సిద్దమవుతుంది. నేటి నుంచి నగరంలోని ఏడు ప్రాంతాల్లో జీఐఎస్ ఇంటిగ్రేటెడ్ సర్వే ఫర్ అర్బన్ ప్లానింగ్ నిర్వహించనుంది. సర్వేను తొలుత ఉప్పల్, హయత్‌నగర్, హైదర్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం ఆస్తి పన్ను పెంచుకునేందుకు నిర్వహిస్తున్న డ్రోన్ సర్వే అనంతరం అన్ని రకాల సేవల కోసం డ్రోన్ సేవలను విస్తరించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. ఇందుకోసం అయిదుగురు అధికారులను ఇటీవలే గుర్గావ్, ముంబై నగరాలకు అధ్యయనం నిమిత్తం పంపినట్లు సమాచారం. ఈ రెండు మహానగరాల్లో అక్కడి స్థానిక సంస్థలు ప్రజలకు ఒక్క క్యూఆర్ కోడ్‌తోనే స్థానిక సంస్థ అందిస్తున్న ఈఎస్ఆర్ఐ సేవలతో పాటు శాంతి భద్రతలకు సంబంధించిన సేవలను అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తొలుత రెండు రకాల సేవలు..

జీహెచ్ఎంసీ పరిధిలో తొలి దశగా రెండు రకాల సేవలనందించేలా వన్ క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టనున్నారు. అక్రమ నిర్మాణాలను పసిగట్టడంతో పాటు రాత్రిపూట డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేసి నేరాలను అదుపు చేసే దిశగా ఈ వన్ క్యూ ఆర్ కోడ్ ఆల్ సర్వీస్ సిస్టమ్‌ అందుబాటులోకి తెచ్చే దిశగా ఈ సర్వేను నిర్వహించనున్నట్లు సమాచారం.

ఆదాయం పెంపు దిశగా బల్దియా అడుగులు..

తొలి దశగా ఎంపిక చేసిన ఏడు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేయనున్న ఈ సర్వేను నగరంలోని అన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 18 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లిస్తూ కమర్షియల్ కార్యకలాపాలను కొనసాగిస్తున్న భవనాల ప్రాపర్టీ ట్యాక్స్‌ను కమర్షియల్ ట్యాక్స్ కిందకు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సర్వేతో జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు ఏటా వస్తున్న రూ.1900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్‌కు అదనంగా రూ.వెయ్యి కోట్లు రావచ్చునన్న అంచనాలతో ఈ సర్వే చేపడుతున్నట్లు సమాచారం. అనంతరం ఇదే సమాచారంతో ఒక్కో ప్రాపర్టీకి ఒక్కో క్యూఆర్ కోడ్ కేటాయించి, జీహెచ్ఎంసీ సేవలన్ని అందించేందుకు వినియోగించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News