టార్గెట్ ఫెయిల్.. ఆశించిన స్థాయిలో సాగని వార్షిక కలెక్షన్

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమాట్టాడుతున్న జీహెచ్ఎంసీ నిధుల సమీకరణ కోసం పెట్టుకున్న రెండు టార్గెట్లు ఫెయిలయ్యాయి. ముఖ్యంగా ట్యాక్స్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సరిగ్గా విధులు నిర్వర్తించకపోవటం,

Update: 2023-04-29 03:17 GMT

దిశ, సిటీ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమాట్టాడుతున్న జీహెచ్ఎంసీ నిధుల సమీకరణ కోసం పెట్టుకున్న రెండు టార్గెట్లు ఫెయిలయ్యాయి. ముఖ్యంగా ట్యాక్స్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సరిగ్గా విధులు నిర్వర్తించకపోవటం, ఉన్నతాధికారులు కలెక్షన్ ను పట్టించుకోకపోవటం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. గత ఆర్థిక సంవత్సర (2022-23) కు సంబంధించి రూ. 2500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ను టార్గెట్ గా పెట్టుకోగా, ఆర్థిక సంవత్సరం చివరి రోజు నాటికి కేవలం రూ. 1641 కోట్లు మాత్రమే వసూలు చేసుకోగలిగారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా ట్యాక్స్ చెల్లించే బకాయిదారులకు ఐదు శాతం రిబేటు నిస్తూ అమలు చేస్తున్న ఎర్లీ బర్డ్ స్కీం కు సంబంధించి ఈ నెలాఖరు వరకు రూ. 750 కొట్ల కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టగా, ఈ నెల 28వ తేదీ నాటికి రూ. 565 కోట్లు వసూలయ్యాయి. ఎర్లీ బర్డ్ స్కీం ముగింపునకు శని, ఆదివారాలు రెండు రోజుల మాత్రమే సమయమున్నా, నిర్ణీత టార్గెట్ ప్రకారం ఇంకా రూ. 190 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావల్సి ఉంది. గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అమలు చేసిన ఎర్లీ బర్డ్ స్కీం కలెక్షన్ రూ. 743 కోట్లు కావటంతో వర్తమాన ఆర్థిక సంవత్సర ఎర్లీబర్డ్ కు అధికారులు కేవలం అదనంగా రూ. 7 కోట్లను మాత్రమే టార్గెట్ గా పెంచారు. కానీ కేవలం 48 గంటల్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావటం చిన్న విషయమేమీ కాకపోయినా, ట్యాక్స్ సిబ్బంది క్షేత్ర స్థాయికెళ్లి ఐదు శాతం రిబేటును బకాయిదారులకు అర్థమయ్యేలా వివరించ గలిగితే ఇప్పటికే ఎర్లీ బర్డ్ స్కీం కలెక్షన్ లక్ష్యాన్ని మంచిపోయేది. కానీ ట్యాక్స్ సిబ్బంది కలెక్షన్ విధులను పెద్దగా పట్టించుకోకుండా ఆన్ లైన్ చెల్లింపులపైనే ఎక్కువ ఆశలు పెట్టుకోవటం వల్లే ఎర్లీ బర్డ్ కలెక్షన్ టార్గెట్ కూడా ఫెయిలయ్యే దిశగా పయనిస్తుంది.

తెరపైకి మళ్లీ పాత నిబంధన

జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం మొదలైన కొత్త లో అమలు చేసిన నిబంధన మళ్లీ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో క్షేత్ర స్థాయిలో ట్యాక్స్ వసూలు చేసేందుకు ఉన్న 140 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, 300 మంది బిల్ కలెక్టర్లకు మే 1 వ తేదీ నుంచి ఆస్తి పన్ను వసూలు చేస్తేనే జీతాలు చెల్లింపులు అన్న నిబంధనను విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ కు నెలసరి టార్గెట్లు ఇచ్చి, అందులో వారు కనీసం 80 శాతం వసూళ్లు చేసేలా వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం.

Also Read..

మద్నూర్‌ అధికార పార్టీలో భగ్గుమన్న విభేదాలు.. కార్యకర్తల్లో టెన్షన్ 

Tags:    

Similar News