వ్యయం కోట్లు.. అయినా తప్పని కుక్క కాట్లు
మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామంటూ పాలకులు గప్పాలు కొడుతున్నా, ఇక్కడ పరిస్థితి మాత్రం కనీసం కుక్కలను, దోమలను కూడా నియంత్రించలేని దుస్థితి.
దిశ, సిటీబ్యూరో : మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామంటూ పాలకులు గప్పాలు కొడుతున్నా, ఇక్కడ పరిస్థితి మాత్రం కనీసం కుక్కలను, దోమలను కూడా నియంత్రించలేని దుస్థితి. కుక్కల నియంత్రణకు ప్రతి ఏటా రూ.10 కోట్లను వెచ్చిస్తున్నా, జనానికి మాత్రం కుక్క కాట్లు తప్పటం లేదు. జీహెచ్ఎంసీలోని వెటర్నరీ విభాగంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాల కారణంగా అసలు లక్ష్యాన్ని పక్కనబెడుతూ, ఏళ్లుగా తిష్టవేసిన అధికారుల అక్రమార్జన వందల కోట్లకు పెరిగిపోతుందే తప్ప, కుక్కల నియంత్రణ మాత్రం క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం జరగడం లేదన్న విషయం తేలిపోయింది.
అంబర్‌పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనతో నగరం ఉలిక్కిపడింది. ముఖ్యంగా నగరంలోని సర్కిల్‌కు ఒకటి చొప్పున ఉన్న డాగ్ స్క్వాడ్‌లోని రెండు బృందాలు ప్రత్యేకంగా కుక్కల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాల్సి ఉంది. పక్కడ్బందీ చర్యలు చేపడుతున్నామంటూ జీహెచ్ఎంసీ నాలుగు ప్రైవేటు ఏజెన్సీలను నియమించుకున్న, కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం ఈ ఏజెన్సీల పనితీరుకు నిదర్శనం. కుక్కల సంఖ్య పెరగకుండా వీధి కుక్కలను పట్టుకొచ్చి, వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్ నిర్వహించి, తగిన వైద్యం అందించిన తర్వాత దాన్ని వదిలేయాల్సి ఉంటుంది.
కానీ ఒక్కో కుక్కకు రూ.1500 స్టెరిలైజేషన్ కోసం ఖర్చు చేస్తున్నామని బిల్లులు క్లెయిన్ చేస్తున్న వెటర్నరీ అధికారులు, ఆ ఆపరేషన్లను వాటిని పట్టుకొచ్చిన డాగ్ స్నాచర్లతోనే చేయిస్తున్నట్లు సమాచారం. నెలకు రెండు, మూడుసార్లు వెరటర్నీ డాక్టర్‌ను పిలిపించి, తూతూమంత్రంగా స్టెరిలేజేషన్ ఆపరేషన్లు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రత్యేక నైపుణ్యత కల్గిన డాక్టర్ వచ్చినపుడు ఆయన ఆపరేషన్ చేసే తీరును డాగ్ క్యాచర్స్‌కు చూపించి, వారే ఆపరేషన్లు చేసేలా వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
దీనికి తోడు కుక్కలు ఒక వేళ జనాన్ని కాటు వేసినా, జనానికి రేబిస్ రాకుండా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది. ఈ వ్యాక్సినేషన్ కూడా తూతుమంత్రంగా చేస్తూ లక్షలాది కుక్కలకు వ్యాక్సినేషన్ చేసినట్లు దొంగ లెక్కలతో బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పలువురు అధికారులు ఈ రకమైన దొంగ లెక్కలతో పట్టుబడి, తమ మాతృ శాఖకు వెళ్లిపోయిన ఘటనలు లేకపోలేవు.
మూగజీవాల తిండిని బుక్కేస్తున్నారు
రోడ్లపై స్వైర విహారం చేసే కుక్కలను నగరంలోని ఐదు యానిమల్ కేర్ సెంటర్లకు తీసుకెళ్లి, దానికి మొట్టమొదటి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి, దానికి స్టెరిలైజేషన్ (సంతానోత్పత్తి శక్తిని తొలగించటం) ఆపరేషన్ జరిగిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకుని, ఒకవేళ జరగకపోతే వెంటనే స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసి, యానిమల్ కేర్ సెంటర్‌లో దానికి మంచి తిండి (కేవలం వెజ్) పెట్టి, అది కోలుకున్న తర్వాతే దాన్ని తిరిగి వదిలేయాల్సి ఉంటుంది.
కానీ జీహెచ్ఎంసీలోని దాదాపు అన్ని సర్కిళ్లలో ఈ రకంగా పట్టుకొచ్చిన కుక్కలకు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయకుండానే చేసినట్లు, వ్యాక్సినేషన్ చేయనిదే చేసినట్లు రికార్డులు సృష్టించి సర్కిల్ వెటర్నరీ విభాగాధిపతి మొదలుకుని కిందిస్థాయి వరకు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
వెటర్నరీ అధికారులు ఎంతకి దిగజారిపోయారంటే పట్టుకొచ్చిన కుక్కలకు మంచి క్వాలిటీ రైస్‌ను ఉప్పు, కారంతో ఉడికించి వేడివేడిగా పెట్టాలన్న నిబంధన ఉంది. కానీ సర్కిళ్లలోని వెటర్నరీ అధికారులు రేషన్ బియ్యం ఉడికించి వాటికి పెడుతూ, సన్నబియ్యం పెట్టినట్లు బిల్లులు తయారు చేస్తున్నట్లు తెలిసింది. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు శేరిలింగంపల్లిలో ఏకంగా కార్మికులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారంటే కుక్కల పేరిట ఎంతటి దోపిడీ జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు.
కార్మికులకు అరకొర జీతాలు
డాగ్ క్యాచింగ్, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వంటి విధుల కోసం జీహెచ్ఎంసీలోని వెటర్నరీ విభాగంలోని పర్మినెంట్, ఔట్‌సోర్స్ ఉద్యోగులే గాక, నాలుగు ఏజెన్సీలు కూడా పని చేస్తున్నాయి. ఈ ఏజెన్సీల్లో డాగ్ స్నాచర్లుగా పని చేస్తున్న కార్మికులకు ఒక్కొక్కరికి కమిషనర్ ఆదేశాల మేరకు రూ.15,500 జీతంగా చెల్లించాల్సి ఉండగా, ఏజెన్సీ నిర్వాహకులు, వెటర్నరీ అధికారులు కుమ్మక్కై కేవలం రూ.9 వేల నుంచి 10 వేల మధ్య చెల్లిస్తున్నట్లు పలువురు కార్మికులు వాపోయారు. పైగా పబ్లిక్ నుంచి ఫిర్యాదులు వచ్చినపుడు ఫీల్డుకెళ్లి కుక్కలను పట్టుకొస్తున్న వీరికి కొందరు స్థానికులు టీ, టిఫిన్ కోసం టిప్ లిస్తే, అవి కూడా లాక్కుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
ఐదేండ్లలో రూ.18 కోట్లు.. జీహెచ్ఎంసీలో కుక్కల బెడద నివారణకు ఖర్చు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడద నివారణకు కోట్లు ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. బస్తీల్లో, కాలనీల్లో గుంపులు గుంపులుగా కుక్కలు సంచరిస్తున్నాయి. ఎవరైనా ఒంటరిగా వెళ్తే ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తాయో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా కుక్కల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయినా సమస్యను పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన బాలుడు మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భంలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేసి తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టేయడం షరా మామూలుగానే మారింది.
గుంపులు గుంపులుగా సంచారం
జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నది. కాలనీల్లో, బస్తీల్లో గుంపులు గుంపులుగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు మహిళలు, చిన్నారులు జంకుతున్నారు. కుక్కల బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య సైతం ఎక్కువవుతున్నది. కుక్కల బెడదను నివారించాలని ఫిర్యాదులు అందుతున్న జీహెచ్ఎంసీ సమస్యలను తీర్చలేకపోతున్నది.
కుక్కల బెడద ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నా.. వాటిని ఎక్కడ, ఎలా ఖర్చు చేశారు ? ఎన్ని కుక్కలను పట్టుకున్నారు? పట్టుకున్న వాటిని ఏం చేశారు? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు.
రూ.18.22 కోట్లు ఖర్చు
గ్రేటర్‌లోని నాలుగు జోన్లలో కుక్కల బెడద నియంత్రణకు గత ఐదేండ్లలో రూ.18.22 కోట్లను బల్దియా ఖర్చు చేసింది. అయినా ఫలితం కనిపించడం లేదు. హైదరాబాద్ నగరంలో గత ఐదేండ్లలో కుక్కల బెడద కోసం ఎంత ఖర్చు చేశారంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ పల్నాటి రాజేంద్ర ఆర్టీఏ కింద జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో రూ.18.22 కోట్లు ఖర్చు చేసినట్లు వారు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేండ్లలో ఒక్క కుక్కను కూడా చంపలేదని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ గతేడాది నవంబర్ నెలాఖరు వరకు చేసిన ఖర్చుకు సంబంధించినవి.
డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు
నగరంలోని నాలుగు జోన్లలో కలిపి కుక్కల బెడద కోసం గత ఏడాది నవంబర్ వరకు మొత్తం రూ.18.22 కోట్లు ఖర్చు చేసినట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. ఇంత మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ కుక్కల బెడద ఏ మాత్రం తగ్గడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు ఇంత మొత్తాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు. ఈ ఖర్చులపై సమాచార హక్కు చట్టం ద్వారా రికార్డులు తనిఖీలు చేస్తాం.- పల్నాటి రాజేంద్ర, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్