GHMC: అంతర్గత బదిలీలపై కమిటీ.. నలుగురు అదనపు కమిషనర్లతో ఏర్పాటు

మహా నగరవాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ అంతర్గత బదిలీలకు సిద్దమవుతోంది.

Update: 2024-08-02 02:22 GMT

దిశ, సిటీ బ్యూరో: మహా నగరవాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ అంతర్గత బదిలీలకు సిద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో బదిలీల ప్రక్రియ ముగియటంతో జీహెచ్ఎంసీ కూడా అంతర్గత బదిలీలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీలో ప్రధాన కార్యాలయం, జోనల్ ఆఫీసు, సర్కిల్ స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సైతం అంతర్గతంగా స్థానచలనం కలిగించేందుకు కసరత్తు చేయలని ఆదేశిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నలుగురు అదనపు కమిషనర్లతో గురువారం ఓ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ కమిటీలో అదనపు కమిషనర్ (ఫైనాన్స్) గీతారాధిక, అదనపు కమిషనర్ (అడ్మిన్) నళినీ పద్మావతి, అదనపు కమిషనర్ (హెల్త్) పంకజ, అదనపు కమిషనర్ (లీగల్, ఎలక్ట్రికల్) సత్యనారాయణలతో కమిటీ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నెలన్నర రోజుల ముందు జీహెచ్ఎంసీలోని ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ స్థాయిల్లో కార్పొరేషన్ ఉద్యోగులు ఏళ్లతరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అప్పటి కమిషనర్ రొనాల్డ్ రోస్ ఒకేచోట, ఒకే విభాగంలో మూడేళ్ల పాటు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ప్రతి సర్కిల్‌లో ఓ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగుల వివరాలను సేకరించిన అడ్మిన్ సెక్షన్ 230 మంది సూపరింటెండెంట్‌లకు ప్రమోషన్ కమ్ ట్రాన్స్‌ఫర్ లిస్టుతో పాటు వివిధ విభాగాల్లో ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. అంతలో అప్పటి కమిషనర్ బదిలీ కావటంతో ఆ జాబితాను పక్కనబెట్టినట్లు సమాచారం. తాజాగా జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలపై కమిషనర్ ఆమ్రపాలి రెండురోజులుగా అదనపు కమిషనర్లతో చర్చించినట్లు, ఇప్పటికే సిద్ధం చేసిన జాబితాపై కసరత్తు చేసి, ఎవరిని ఎక్కడ నియమించాలన్న విషయంపై కమిటీలో నిర్ణయం తీసుకుని, జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రేషనలైజేషన్..

కార్పొరేషన్‌కు చెందిన పర్మినెంట్ ఉద్యోగుల బదిలీలతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై కూడా నలుగురు అదనపు కమిషనర్లతో ఏర్పాటు చేసిన కమిటీ దృష్టిసారించనున్నట్లు సమాచారం. నాలుగేళ్ల ముందు ఔట్‌సోర్సింగ్ కార్మికుల్లో కంప్యూటర్ ఆపరేటర్లను ర్యాండమ్‌గా బదిలీలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిని బదిలీలు చేయకపోవడంతో చాలాకాలంగా వారు సీట్లకు అతుక్కుపోయి ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు పర్మినెంట్ ఉద్యోగుల బదిలీలతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రేషనలైజేషన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సుమారు 16 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రస్తుతం విధుల నిర్వహిస్తుండగా.. వారిలో దాదాపు 2 వేల మంది కంప్యూటర్ ఆపరేటర్ క్యాటగిరి కింద నియమించినా, వీరిలో చాలామంది అదనపు కమిషనర్, జాయింట్ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమినషర్లు, పలువురు ఇంజినీర్ల పేషీల్లో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు కంప్యూటర్ ఆపరేటర్లుగా వారికి పని కల్పించాలని భావిస్తూనే ఈ రేషనలైజేషన్‌కు ఉన్నతాధికారులు తెరదీసినట్లు సమాచారం.

Tags:    

Similar News