ఘరానా దొంగ రిమాండ్
చోరీకి గురైన వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఘరానా దొంగను చిక్కడపల్లి పోలీసులు పట్టుకున్నారు.
దిశ, ముషీరాబాద్ : చోరీకి గురైన వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఘరానా దొంగను చిక్కడపల్లి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసీపీ ఎల్ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ సీతయ్య, క్రైమ్ ఎస్ఐ కోటేశ్వరరావు తో కలిసి వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన చాగంటి పవన్ తిరుమలేష్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి మద్యం, గంజాయి తదితర దురలవాట్లకు బానిసగా మారాడు. దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడడం,
ఖరీదైన వాహనాలను దొంగలించడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇతనిపై విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో క్రైమ్ పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని నాంపల్లి క్రిమినల్ కోర్టు 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. ఉదయ భాస్కర్ ముందు హాజరు పరచగా నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుడిని పట్టుకున్న క్రైమ్ స్టాఫ్ ను ఈ సందర్భంగా ఏసీబీ అభినందించారు.