JD Lakshmi Narayana : ఆకాశమే హద్దుగా ఎదగాలి..

విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఎదగాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

Update: 2023-07-31 13:39 GMT

దిశ, మెహిదీపట్నం : విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఎదగాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీ స్థాపించిన పుల్లారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి భవిష్యత్తుకు సంబంధించిన అంశాల పై దృష్టి సారించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమరు తాము తగ్గించుకొని ఆలోచించొద్దని చెప్పారు. ఒక వస్తువును వేరువేరుగా ఉపయోగించి వేరువేరు ప్రయోజనాలు పొందవచ్చు అన్నారు. ఒక కత్తి గృహిణికిస్తే కూరగాయలు తరుగుతుందని, అదే డాక్టర్ అయితే ఆపరేషన్ చేస్తాడని, క్రిమినల్ హత్య చేస్తాడని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరిలో అదే మేధస్సు ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకునే విధానంలో తేడా ఉంటుందని తెలియజేశారు. అమ్మాయిలు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని, వాటిని దుండగులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు వీలైనంత ఎక్కువగా మహనీయుల పుస్తకాలు చదవాలని, తమ కన్నవారి కలలను నెరవేర్చాలని తెలిపారు. ఆకాశమే హద్దుగా ఉన్నత శిఖరాలకు చేరుకొని సమాజ అభ్యున్నతి కోసం తమ వంతు సహకరించాలని సూచించారు. అదేవిధంగా ఆయన ఆడిటోరియంలో ఫోటోల్లో ఉన్న పలువురు గొప్ప వ్యక్తుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పులారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాఘవరెడ్డి, సుబ్బారెడ్డి, కోశాధికారి ఏకాంబర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకయ్య, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News