కన్నులపండువగా బోనాలు

గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తొలి బోనం అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

Update: 2024-07-07 13:59 GMT

దిశ, మెహిదీపట్నం: గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తొలి బోనం అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయ పూజారి సర్వేష్ చారి ఇంటి నుంచి, అదేవిధంగా మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ వృత్తి పనివారాల సంఘం అధ్యక్షుడు బొమ్మల సాయిబాబా చారి ఇంట్లో నుంచి కోటపైకి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో పోతరాజుల హంగామా, శివసత్తుల పూనకాలు, యువతి యువకుల కేరింత మధ్య కోలాహలంగా సాగింది. హైదరాబాద్ మహానగరం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చి అమ్మవార్లను మొక్కుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు..

కనీవిని ఎరగని రీతిలో..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఆషాడ మాసం బోనాలను ప్రజలకు కనీ విని ఎరుగని రీతిలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి ( ఎల్లమ్మ తల్లి ) అమ్మవారి ఆషాడ మాస బోనాల మహోత్సవాలు ఆదివారం లంగర్ హౌజ్ చౌరస్తా లో నిర్వహించిన బోనాలు , తొట్టెల ,రథం ఊరేగింపు కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్,మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బోనాల సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం మహిళగా తనకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలుకు సకల సౌకర్యాలు, ప్రశాంత వాతావరణంలో బోనాలు సమర్పించుకొని ఇళ్లకు చేరుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇందుకోసం పలుమార్లు ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు ఆదేశించడం జరిగిందని, అలాగే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా విద్యుత్ శాఖను ఆదేశించడం జరిగిందన్నారు. బ్యారిగేటింగ్, నీటి సౌకర్యం, వైద్య సేవలు అందించేందుకు సంబంధిత శాఖలను ఆదేశించడం జరిగిందన్నారు.

గతంలో నిర్వహించిన బోనాలను మరిపించే విధంగా ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసేందుకు గతంలో కంటే 10 శాతం నిధులు పెంచి దేవాలయాలకు అందించడం జరిగిందన్నారు. ఈ ఏడాది చిన్న దేవాలయాలకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిధులు అందజేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు 20 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఎలాంటి ఇబ్బంది, ఏ చిన్న అవంతరాలు కుండా ప్రశాంత వాతావరణంలో బోనాలు సమర్పించుకొని వెళ్లేలా ప్రజలకు సహకరించాలని పోలీసులకు సూచించారు.

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత నెల రోజులుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహాయ, సహకారాలు కావాలి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోతరాజులతో కలిసి నృత్యం చేశారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజు విన్యాసాలతో కోట పైకి తొట్టెల రథం ఊరేగింపు జరిగింది.

రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో..

తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) అమ్మవారికి తొలి బోనంతో పాటు 501 బోనాలను సమర్పించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆదివారం ఉదయం భారీ ఎత్తున బోనాలను అమ్మవారికి సమర్పించారు.

అంబారి( బొమ్మ ఏనుగు )పై అమ్మవారి ఊరేగింపు...

గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని గోల్కొండలోని కులవృత్తుల సంఘం అధ్యక్షుడు సాయిబాబా చారి, శ్రీకాంత్ చారి ఇంట్లో నుంచి అమ్మవారి విగ్రహాన్ని అంబారిపై ఊరేగించి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు తీసుకువెళ్లారు. ఈ భారీ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ విధంగా శ్రీకాంత్ చారి ఇంటి వద్ద సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేగింపు కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. ఊరేగింపు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

జలమండలి ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా... చారిత్రాత్మకమైన గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆలయ బోనాల ఉత్సవాల్లో భాగంగా జలమండలి ఆధ్వర్యంలో కోటపైకి వచ్చిన వేలాదిమందికి మంచినీటి సరఫరాను ఏర్పాటు చేశారు. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి ఫతే దర్వాజా గోల్కొండ కోట ముఖద్వారం వద్ద గోల్కొండ కోట అమ్మవారి దేవాలయం వద్ద ఆరు ప్రాంతాల్లో ఉచితంగా భక్తులకు మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు వాటర్ వర్క్స్ డైరెక్టర్ విజయరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ , దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంత రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఆలయ కమిటీ చైర్మన్ అరవింద్ మహేష్ కుమార్, నేతలు రాజు వస్తాద్, చంటిబాబు, సత్యం రెడ్డి, గోల్కొండ ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరాజు, పీస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Similar News