జీహెచ్ఎంసీ కమిషనర్ టైమ్ కోసం జెడ్సీ, ఏసీల ఎదురుచూపులు

బల్దియా బాసు బాగా బిజీగా ఉంటున్నారు. ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు చర్చించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-08-07 03:02 GMT

దిశ, సిటీబ్యూరో : బల్దియా బాసు బాగా బిజీగా ఉంటున్నారు. ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు చర్చించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నిసార్లు పేషీ చుట్టూ చక్కర్లు కొట్టినా కమిషనర్ అపాయింట్‌మెంట్ దక్కటం లేదంటూ అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా బదిలీల్లేని జీహెచ్ఎంసీ సిబ్బందికి సైతం అంతర్గతంగా స్థానచలనం కలిగించేందుకు కసరత్తు చేయలని ఆదేశిస్తూ ఆమ్రపాలి నలుగురు అదనపు కమిషనర్లతో గురువారం ఓ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కమిటీ సభ్యులు తాము చేసిన కసరత్తుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పలు సార్లు సంప్రదింపులు జరిపినా కమిషనర్ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. ఆమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు మరో నాలుగు పోస్టుల్లో కొనసాగుతున్నందున ఆమె షెడ్యూల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. అదనంగా హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌కు ప్రాజెక్టు ఆఫీసర్‌గా కొనసాగటంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ బోర్డుకు కూడా కమిషనరే ఎండీగా కొనసాగుతున్నందున కింది స్థాయి అధికారులు, సందర్శకులకు సమయం కేటాయించలేక పోతున్నట్లు సమాచారం.

అంతర్గత బదిలీలకు మోక్షం ఎప్పుడో?..

జీహెచ్ఎంసీ ఉద్యోగుల అంతర్గత బదిలీల ప్రక్రియ ను ప్రారంభించి నెలలు గడుస్తున్నా, ఆ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. ఏళ్ల నుంచి ట్రాన్స్‌ఫర్ కమ్ ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల బదిలీలకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది నన్నది చర్చనీయాంశంగా మారింది. మాజీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రాసెస్ పూర్తి చేసిన వెంటనే ఆయన బదిలీ కావడం, ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించి దాదాపు నెలన్నర గడుస్తున్నా ఆ బదిలీలకు మోక్షం కలగడం లేదు. కమిషనర్ ఎప్పుడు పిలుస్తారో? ఎప్పుడు టైమ్ ఇస్తారోనని సంబంధిత విభాగం అధికారులు వెయిటింగ్ చేస్తున్నారు. కమిషనర్ అందుబాటులో లేకపోవటంతో పరిపాలనపరమైన ఫైళ్లు సైతం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కమిషర్‌ను కలిసేందుకు అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు తరుచూ ఆమె పేషీ సిబ్బందిని అపాయింట్‌మెంట్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి తోడు ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అయిదు గంటల మధ్య పలువురు సాధారణ సందర్శకులు కమిషనర్‌ను కలిసేందుకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

అయిదు రోజుల్లో నివేదిక ఇవ్వమని..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై మూడు అంశాలకు సంబంధించిన మూడు కమిటీలకు సైతం కమిషనర్ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. ఈ కమిటీల్లో ఐఎఎస్ ఆఫీసర్లతో పాటు నాన్ ఐఏఎస్ జోనల్, అదనపు కమిషనర్లను సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అభివృద్ధి, మౌలిక వసతులు మెరుగు, రెండో అంశంగా జీహెచ్ఎంసీలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి భద్రత, మూడో అంశంగా నగరంలో అర్బన్ బయోడైవర్శిటీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, కాంట్రాక్టర్ల ఎంప్యానల్ వంటి అంశాలపై వర్కవుట్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించిన కమిషనరే తమకు అందుబాటులో లేకపోవటంతో అధికారులు అసహనానికి గురవుతున్నారు. గత నెల 27న నియమించిన కమిటీలకు అయిదు రోజుల్లో నివేదికలను సమర్పించాలని ఆదేశించి నేటికీ పది రోజులు గడుస్తున్నా, కమిషనర్ అధికారులను పిలిపించుకుని చర్చించటం గానీ, వారు వచ్చినప్పుడు గానీ కలవలేక, బిజీగా ఉంటున్నట్లు చర్చ జరుగుతుంది.


Similar News