జనవరి 3 నుంచి నుమాయిష్..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 84వ నుమాయిష్ 2025 జనవరి 3న ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ బీ.ప్రభాశంకర్ తెలిపారు.
దిశ, కార్వాన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 84వ నుమాయిష్ 2025 జనవరి 3న ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ బీ.ప్రభాశంకర్ తెలిపారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటెనరి హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ ఉపాద్యక్షుడు కే.నిరంజన్, కార్యదర్శి బీ.సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డీ.మోహన్‌లతో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. 26 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్వహిస్తున్న నుమాయిష్ కు దాదాపు 2000 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర శాఖలు కూడా స్టాల్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మూడు నెలల పాటు పదివేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని వివరించారు.
వచ్చిన ఆదాయంతో 20 విద్యా సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి చర్యలు తీసుకుంటున్నామని, ఆయా కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 30 వేల మంది విద్యను అభ్యసిస్తుండగా 2,500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారన్నారు. గాంధీభవన్ నుంచి మియాపూర్ ఎల్బీనగర్ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. టికెట్టు ధర రూ.50, సీనియర్ సిటిజనులు వీక్షించేందుకు వీల్ చైర్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఫ్రీ పార్కింగ్‌తో పాటు యశోద గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. డిజిటల్ లావాదేవీలు, టీఎస్ఆర్టీసీ, మరుగుదొడ్లు, ప్రైవేట్ సెక్యూరిటీలు, వలంటరీలు, సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటాయని ఎలాంటి ఫిర్యాదులు ఉన్న ఎగ్జిబిషన్ సొసైటీ లేదా రిసెప్షన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అతిథులుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వినయ్ కుమార్ ముదిరాజ్, అనిల్ స్వరూప్ మిశ్రా, ఆదిత్య మార్గం, అశ్విన్ మార్గం తదితరులు పాల్గొన్నారు.
హైలెట్స్...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, అటవీ శాఖ, జైళ్ల శాఖ, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, తెలంగాణ ఖాదీ అండ్ గ్రామ పరిశ్రమల బోర్డు, తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ పోలీస్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అంకిత్ స్టూడియో, చిమ్నీ వరల్డ్, భాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ పారిశ్రామికవేత్తల సంక్షేమ సమాఖ్య (సిడ్బి) విద్యా సంస్థలు, ఏటీఎంలు, ఎల్ఈడిలు, ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్నులతో పాటు మహిళల భద్రతకు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.