ఆ సార్ కోసమే.. గ్రేటర్ బయట..బల్దియా కుక్కల వేట?
జీహెచ్ఎంసీలో దశాబ్దాలుగా తిష్టవేసిన కొందరు వెటర్నరీ విభాగంలోని ఉన్నతాధికారులు ఆ విభాగంలోని మ్యాన్‌పవర్‌ను, మిషనరీని, వెహికల్స్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో దశాబ్దాలుగా తిష్టవేసిన కొందరు వెటర్నరీ విభాగంలోని ఉన్నతాధికారులు ఆ విభాగంలోని మ్యాన్‌పవర్‌ను, మిషనరీని, వెహికల్స్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టున్న ప్రాంతాల్లో కుక్కలను పట్టుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ మ్యాన్‌పవర్, మిషనరీని దుర్వినియోగం చేసిన వెటర్నరీ విభాగం అధికారులు ఇప్పుడు తాజాగా మరో ఘనకార్యాన్ని తెరదీశారు. ముఖ్యంగా శేరిలింగంపల్లిలోని వెటర్నరీ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఓ అధికారి జీహెచ్ఎంసీ బయట తాను నివసిస్తున్న ఓ మున్సిపాల్టీ పరిధిలో నెలకు రెండుసార్లు జీహెచ్ఎంసీ మ్యాన్‌పవర్, వెహికల్స్‌తో కుక్కల వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో మరో విభాగానికి చెందిన మరో డీడీ కూడా ఇక్కడే నివాసముంటున్నట్లు సమాచారం.
దశాబ్దాలుగా జీహెచ్ఎంసీలోనే తిష్టవేసి, తనను పశుసంవర్ధక శాఖ నుంచి జీహెచ్ఎంసీ అబ్సాప్షన్ చేసుకుందని చెప్పుకుంటున్న సదరు అధికారి నెలకు రెండుసార్లు ఓ డాగ్ క్యాచ్ వెహికల్, ఆరుగురు డాగ్ క్యాచర్లను శేరిలింగంపల్లి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో నున్న తాను నివసిస్తున్న ఏరియాకు పంపి, కుక్కలను పట్టుకుని శేరిలింగంపల్లికి తీసుకొస్తున్నట్లు తెలిసింది. తెచ్చిన కుక్కలకు శేరిలింగంపల్లిలోని యానిమల్ కేర్ సెంటర్‌లోనే ఉంచి, జీహెచ్ఎంసీ నిధులతోనే వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేయిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఆ కుక్కలను సిటీలోనే వదిలేస్తున్నట్లు సమాచారం. కేవలం తాము నివసిస్తున్న ప్రాంతంలో కుక్కలు కనిపించొద్దన్న ఉద్దేశ్యంతోనే సదరు డిప్యూటీ డైరెక్టర్ పక్కనున్న మున్సిపాలిటీలోని కుక్కలను తెచ్చి సిటీలో వదులుతున్నట్లు తెలిసింది. మరో వైపేమో గ్రేటర్ పరిధిలో రోజుకో చోట కుక్కకాట్లు జరుగుతూ బల్దియా అధికారులు తలలు పట్టుకుంటుండగా, గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణ కోసం వినియోగించాల్సిన మిషనరీ, మ్యాన్‌పవర్‌ను కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది.
సారొచ్చారంటే..అంతే..
పలుమార్లు అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారి డ్యూటీకి వచ్చేదే వారానికోరోజు. అది ఆదివారం ఉదయం. సారొచ్చారంటే చాలు ఆగమేఘాలపై టీ, టిఫిన్ రెడీ చేయాల్సిందే. ఆఫీసర్ టిఫిన్ ముగించేలోపే సారొచ్చిన కారుకు ఫూల్‌గా సర్వీసింగ్ చేసి, ఆఫీసర్ కోసం తెచ్చిన మటన్, చికెన్ కారులో ఉంచితే సదరు ఆఫీసర్ డ్యూటీ ముగిసినట్టే. అలా హడావుడి చేసే సదరు డీడీ గడిచిన రెండు నెలలుగా డ్యూటీకి హాజరు కావడం లేదని తెలిసింది. ఇటీవల లీవ్ లెటర్ పంపినట్లు విశ్వసనీయ సమాచారం. చీఫ్ వెటర్నరీ ఆఫీసర్‌గా అబ్దుల్ వకీల్ పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సదరు డీడీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి రాకపోకలు మానేశారు. రోడ్లపై తిరుగుతుండగా జీహెచ్ఎంసీ వెటర్నరీ సిబ్బంది పట్టుకొచ్చిన కొన్ని మూగజీవాలను అమ్ముకున్న ఆరోపణలు సైతం ఉన్నాయి.