సికింద్రాబాద్‌లో ప్రచారం మొదలుపెట్టని దానం
పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తున్న సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం మొదలు పెట్టకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురౌతున్నారు.
దిశ, హైదరాబాద్ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తున్న సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం మొదలు పెట్టకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురౌతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కారు పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరిన ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది. ముందుగా పార్టీ ఆయన పేరును ప్రకటించినప్పటికీ ఆయన ప్రచారంలో ఎక్కడా కనబడటం లేదు. ఓ వైపు ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి ప్రజల వద్దకు రాకపోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.
ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని, ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమనే గుసగుసలు వినబడినప్పటికీ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రత్యర్థులు బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్‌లు ఇప్పటికే తమ నామినేషన్లను దాఖలు చేసి ప్రతినిత్యం నియోజకవర్గం పరిధిలో ప్రచారాన్ని హోరెత్తి స్తుండగా దానం నాగేందర్ ఎక్కడా కనబడకపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలలో పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇలానా..?
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్క ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు మినహాయిస్తే ఇతర అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ ఒక్క నియోజకవర్గం అధికార పార్టీ ఖాతాలో చేరింది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్, బీజేపీలు బలంగా కనబడుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రచారంలో వెనుకబడిపోవడం, మరోవైపు ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. 2014, 2019 ఎన్నికలను బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. ఈ పర్యాయం గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ భావిస్తుండగా దానంను అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ పర్యాయం బీజేపీ గెలుపు అంత సులువు కాదని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ప్రచారంలో ఎక్కడ కనబడకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది.
రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు..
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. నామినేషన్లకు కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటం, ఇప్పటి వరకు దానం నాగేందర్ తన నామినేషన్‌ను కూడా సమర్పించకపోవడం నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్‌లు కూడా ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. దానం నాగేందర్ అభ్యర్థిగా ఉంటారా? లేక మార్పు ఉంటుందా? అనేది గురువారంతో స్పష్టత రానుంది.