పోలీసులకు దొరికిపోయిన ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా..
నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లు తయారు చేసి వాహనదారులకు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.
దిశ, శేరిలింగంపల్లి : నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లు తయారు చేసి వాహనదారులకు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ సీఐ తిరుపతి రావుతో కలిసి వెల్లడించారు. మర్పల్లికి చెందిన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్ పేట్ కు చెందిన మహమ్మద్ సర్వర్ షరీఫ్ (28) ఆదిత్యనగర్ లో అమైరా కమ్యూనికేషన్ కస్టమర్ సర్వీస్ పాయింట్ పేరుతో ఇంటర్నెట్ సెంటర్ ను నడుపుతున్నాడు.
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మహమ్మద్ సర్వర్ షరీఫ్ ఇతను మీర్జా ఇలియాజ్ బేగ్, షేక్ జమీల్ అహ్మద్, అజహర్ అనే మరో ముగ్గురితో కలిసి వాహనదారులకు ఆయా బీమా కంపెనీలకు అవసరమైన నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ తయారుచేసి అతను వాటిని ఒక్కొక్కటి రూ. 500 నుండి రూ1,000, రూ. 2000 వేలకు వరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఇందులో ఏ1 తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా ఏ4 అజహర్ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. వారి వద్ద నుండి వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లు, కంప్యూటర్ మానిటర్ లు, హార్డ్ డిస్క్ లు, ప్రింటర్, 4 మొబైల్ ఫోన్ లతో పాటు రూ. 79 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, భారతి జనరల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్, డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన 116 బీమా పాలసీలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐసీఐసీఐ ఇన్సూరెన్స్ కు చెందిమ 80 పాలసీలు, యునైటెడ్ ఇండియా-16, భారతి-18, హెచ్ డీఎఫ్ సీ ఎర్గో -1, డిజిట్ ఇండియాకు సంబంధించి-1 ఇన్సూరెన్స్ ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆయా కంపెనీల రబ్బర్ స్టాంప్స్ లను, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 388/2023 యూఎస్ 420, 468, 471,472, 474 రెడ్ విత్ ఆర్ డబ్ల్యూ 35 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు.