రాష్ట్రం గొప్పతనం చాటేలా స్వాతంత్య్ర వేడుకలుః సీఎస్ శాంతికుమారి

Update: 2024-08-12 12:12 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరోః స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్రం గొప్పతనం చాటేలా నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి అన్నారు. సోమవారం గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను డిజిపి జితేందర్ ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా శాంతికుమారి మాట్లాడుతూ ఈ నెల 15న గోల్కొండ కోటపై నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలను పగడ్బందీగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. గ్యాలరీలలో ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని సూచించారు. వేడుకల నిర్వహణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, త్రాగునీరు, మెడికల్ స్టాల్, వాటర్ ప్రూఫ్ షామియానాలు, సౌండ్ ప్రూఫ్ జనరేట్ అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రోటోకాల్ పాటించాలని, స్వాతంత్ర్య సమరయోధులు, విఐపి, వివిఐపిలు, పుర ప్రముఖులు, వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు గ్యాలరీలు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా సాంస్కృతిక బృందాలు సాంప్రదాయ దుస్తులతో పెద్ద సంఖ్యలో రాష్ట్ర గొప్పదనం, విభిన్న సాంస్కృతిక వారసత్వాలు ప్రతిబింబించేలా వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికి పైగా కళాకారులు పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి సందేశమిచ్చే స్టేజ్, అవార్డులను అందచేసే స్థలం, గౌరవ వందనం స్వీకరించే స్థలాన్ని కూడా ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, జిఎడి సెక్రటరీ వెంకట్రావు, ఆర్ అండ్ బి సెక్రటరీ హరిచందన, సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు, జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, సాంస్క్రతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సి. ఎం. సెక్యూరిటీ అధికారులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News