ఫిర్యాదులు అందితేనే దాడులా..
పేరుకు పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, కానీ అవి లోపటికి వెళ్లి చూస్తే దుర్గంధం, ఈగలు, దోమలు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి.
దిశ, చైతన్య పురి : పేరుకు పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, కానీ అవి లోపటికి వెళ్లి చూస్తే దుర్గంధం, ఈగలు, దోమలు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి. ఇది ఎక్కడో కాదు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు హోటళ్లు రెస్టారెంట్ల పరిస్థితి. దాడులు చేసి పరిశీలించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నామ మాత్రపు తనిఖీలు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఆకలితో వచ్చే కస్టమర్ లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అసలు పరిస్థితి ఏమిటి..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో వందల సంఖ్యలో రెస్టారెంట్ లు, హోటల్లు నెలకొన్నాయి. ఆకర్షనీయమైన రంగులతో ముస్తాబు చేసిన రెస్టారెంట్ లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఎల్బీనగర్, నాగోల్ చైతన్య పురి, వనస్థలిపురం ప్రాంతాల్లో కస్టమర్ లకు తాము తినే ఆహారంలో బొద్దింకలు, వెంట్రుకలు దర్శనమిచ్చాయి. ఇదేమని కస్టమర్ లు ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు వ్యంగ్య సమాధానాలు ఇచ్చారు. రెస్టారెంట్లు హోటళ్లు నాణ్యతలేని ఆహార పదార్థాలు రోజుల తరబడి నిల్వ ఉంచి వాటిని కస్టమర్లకు వడ్డిస్తున్నారు. తద్వారా కుళ్లిపోయిన ఆహార పదార్థాలను తిని పలువురు అస్వస్థతకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత పాటించకపోవడం, నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న రెస్టారెంట్లు, హోటల్స్ అనేకం ఉన్నట్లు ఇటీవల అధికారులు వెల్లడించారు.
నామ మాత్రపు తనిఖీలు..
ఆకలి తీర్చుకోవాలని కస్టమర్లు వెళ్లిన తర్వాత వారికి అసౌకర్యం కలిగితే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల మూడు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు నాగోల్, ఎల్బీనగర్ లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లలో ఫుడ్‌ను తయారు చేస్తున్న విధానం, వాళ్లు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలను చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగోల్ ఆల్కపురి చౌరస్తా లో ఉన్న లక్కీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాడైపోయిన ఫుడ్ సర్వ్ చేస్తున్నారని కస్టమర్ ఫిర్యాదు మేరకు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు. దాడుల్లో భాగంగా కిచెన్ అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు. అంతేకాకుండా కుళ్ళిపోయిన పన్నీర్, క్యాబేజీ, చికెన్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రెస్టారెంట్‌ను నడుపుతున్నారంటూ రెస్టారెంట్ యజమానికి అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎల్బీనగర్ మధురం రెస్టారెంట్‌లో చికెన్‌లో వెంట్రుక వచ్చిందని కస్టమర్ ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెస్టారెంట్ కిచెన్‌ను తనిఖీ చేయగా కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అనంతరం రెస్టారెంట్‌కు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రెస్టారెంట్లలో ఉపయోగించే ఆహార పదార్థాల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కిచెన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని లేని పక్షంలో చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఇంకో విషయం ఏమిటంటే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టి విభాగం అధికారులకు ఏ హోటల్ కు వెళ్లినా ఉచితంగా బిర్యానీ ప్యాకెట్లు అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే తనిఖీలు చేయరని విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తేనే కదులుతారని చర్చ నడుస్తుంది.
శని, ఆదివారాల్లో ఫుల్ గిరాకీ..
శని, ఆదివారం వచ్చిందంటే రెస్టారెంట్లలో ఫుల్ గిరాకీ ఉంటుంది. లంచ్ చేయడానికి ఖాళీ సీట్లు దొరకకపోవడం వలన నిలబడి వేచి ఉంటున్నారు. నాణ్యత ప్రమాణాలు దేవుడెరుగు. భోజనం ఆరగించడమే చూస్తున్నారు. భోజనంలో ఏదైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టినాగాని జనాలు అదేపనిగా అదే హోటల్లో కనబడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.