స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి : మంత్రి కేటీఆర్
స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఆదేశించారు.
దిశ, ముషీరాబాద్ : స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఆదేశించారు. సెంట్రల్ హైదరాబాద్ నగరానికి స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు మౌలిక సదుపాయాల కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ శనివారం పరిశీలించారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి పనుల వరకు చేరుకున్న మంత్రి కేటీఆర్ స్టీల్ బ్రిడ్జ్ పురోగతిని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అశోక్‌నగర్ వద్ద కొనసాగుతున్న నాలా ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలలలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలలో నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని కేటీఆర్ ఆదేశించారు.
నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అటు కార్మికులకు, నగర పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలను కూడా తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎస్ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా వరద ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి, వరద ప్రమాదాన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలాకు భారీ ఎత్తున నిధులు కేటాయించి రిటైనింగ్ వాల్ వంటి పనుల నిర్మాణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో వేగంగా ముందుకు పోవాలని సూచించారు.
2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం దాదాపు 440 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ ని తగ్గించి, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట్ వంటి నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉన్నదని, ఇంతటి కీలకమైన ఈ బ్రిడ్జి నిర్మాణం సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జి మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం రానున్న 3 నెలల్లో పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మంత్రితో పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్టీల్ బ్రిడ్జి ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.