Hyd: ప్రధాని మోదీపై పొన్నాల తీవ్ర విమర్శలు.. హామీలపై నిలదీత

మణిపూర్ ఘటనపై పార్లమెంట్‌లో చర్చించకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు...

Update: 2023-08-16 11:51 GMT

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ ఘటనపై పార్లమెంట్‌లో చర్చించకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు. మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని రాజకీయ ప్రయోజనం కోసమే ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన పొన్నాల లక్ష్మయ్య.. కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలు, మణిపూర్ ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపూర్‌లో ప్రశాంతత నెలకొంటే ఇప్పటివరకూ ప్రధాని మోదీ అక్కడ ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మణిపూర్‌లో పర్యటించి ప్రజలకు విశ్వాసం కల్పించాలని పొన్నాల సూచించారు.

 ప్రతిసారి ప్రధాని మోదీ కోవిడ్ గురించి మాట్లాడుతున్నారని,  ఆ సమయంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని పొన్నాల ఎద్దేవా చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ గురించి చెప్పే ముందు లక్షలాది మంది చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కోట్లాది మంది వలస కూలీలు నానా తిప్పలు పడ్డారని పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. ఎలాంటి వాహనాలు తిరకపోవడంతో వలస వెళ్లిన వారు కాలినడకన సొంత స్థలాలకు చేరుకున్నారని తెలిపారు. ఆ కష్టాలన్నింటినీ అధిగమించినా గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారని నిలదీశారు. దేశంలో 90 శాతం సామాన్య జనాలే జీఎస్టీ కడుతున్నారని చెప్పారు. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు, 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత ఏమైందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన అన్నీ హామీలను నెరవేర్చే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర బీజేపీదేనని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు

Tags:    

Similar News