ముత్యాలమ్మ టెంపుల్ వద్ద భద్రత పెంచిన నగర పోలీసులు

సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో మంగళవారం పూజలు మొదలు పెట్టారు.

Update: 2024-10-15 14:30 GMT

దిశ, బేగంపేట : సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో మంగళవారం పూజలు మొదలు పెట్టారు. ఈ నెల 14వ తేదీన దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం విధితమే. బస్తీ ప్రజలు, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికలు తదితరులు మంగళవారం ఉదయం సంప్రోక్షణ చేయించారు. అలాగే అమ్మవారిని ఆవాహనం చేసి కళల స్థాపన చేశారు. వేద పండితుల సూచన మేరకు దేవాలయంలో పూజలు ఆగిపోకుండా ఉండేందుకు కలశస్థాపన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కొద్ది రోజుల పాటు ఇలాగే పూజలు కొనసాగించి వేదపండితులు, పెద్దల సూచనల మేరకు అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. మంగళవారం ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి , ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కార్పొరేటర్లు, కొంతం దీపిక, రాజ్యలక్ష్మి, సునీత తదితరులు అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. మాజీ కార్పొరేటర్ వసంత యాదవ్, నాయకులు శరత్్సంగ్ ఠాకూర్, దయానాంద్, ఆకుల ప్రతాప్, నర్సింగ్గారావు, ఈశ్వర్, గుంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇంటెలిజెన్స్ వైఫల్యం: మర్రి

రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వర్గాల పూర్తి వైఫల్యం మూలంగానే కుమ్మరిగూడలో అమ్మవారి విగ్రహం ధ్వంసం లాంటి ఘటనలు జరుగుతున్నాయని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇవి చూస్తుంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు గుర్తుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి ఇలాంటి వాటిని ఎవరైనా ప్రోత్సహిస్తూ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ వసంత యాదవ్, శరత్ సింగ్ ఠాకూర్, దనాంద్, ఆకుల ప్రతాప్, నర్సింగ్రావు, ఈశ్వర్, గుంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విషమంగానే నిందితుడి పరిస్థితి

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి పట్టుబడిన నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేయగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నిందితుడు ఇంకా స్పృహలోకి రాలేదని, వస్తే ఎక్కడి నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అన్ని వివరాలు తెలుస్తాయని మార్కెట్ పోలీసులు చెబుతున్నారు.


Similar News