కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా రంగాన్ని గుర్తించాలి

దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా విస్తరించిన నేపథ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా రంగాన్ని వెంటనే గుర్తించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్​డబ్ల్యూజె) డిమాండ్ చేసింది.

Update: 2024-10-02 10:27 GMT

దిశ, ముషీరాబాద్ : దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా విస్తరించిన నేపథ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా రంగాన్ని వెంటనే గుర్తించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్​డబ్ల్యూజె) డిమాండ్ చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని మథుర (బృందావన్)లో గల వ్రిందా ఆనందం రిసార్ట్స్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన మూడు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశాలలో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల, మీడియా రంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపి పలు తీర్మానాలు చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడారు. సమావేశాల్లో ఆమోదించిన పలు తీర్మానాలను ఈ సందర్భంగా వారు వెల్లడించారు. డిజిటల్ మీడియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అందులో పనిచేస్తున్న పాత్రికేయులకు అక్రెడిటేషన్ కార్డులు, ఇతర సదుపాయాలు కల్పించాలని జాతీయ కౌన్సిల్ సమావేశం విజ్ఞప్తి చేసింది. డిజిటల్, శాటిలైట్, యూట్యూబ్ చానళ్లు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో హింస, విధ్వేషం, అశ్లీలత, పిల్లలపై జరిగే అమానవీయ సంఘటనలు వంటి వార్తలను ప్రసారం చేయకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సమావేశం సూచించిందన్నారు.

     డిజిటల్ వినియోగదారుల హక్కులు, సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు. సోషల్ మీడియా, వీడియో ఆధారిత మల్టీ మీడియా, కంప్యూటర్ జనరేటెడ్ న్యూస్ వెబ్ సైట్లు, న్యూస్ యాప్ లలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ ప్రభుత్వాలు గుర్తించాలని జాతీయ కౌన్సిల్ సమావేశాలు విజ్ఞప్తి చేశాయన్నారు. డిజిటల్ మీడియా వివిధ అంశాలపై ప్రశ్నించడం, మాట్లాడడం, రాయడం కొనసాగిస్తూనే ఉండాలని సమావేశం విజ్ఞప్తి చేసిందని తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు రాజ్యంగం కల్పించిన హక్కుగా ఉండాలని, ప్రభుత్వ కార్యకలాపాలు సేకరించి ప్రజలకు అందించేందుకు తోడ్పడాలని సమావేశం సూచించినట్లు వారు తెలిపారు. మీడియా స్వతంత్ర, నిష్పాక్షిక, సాహసపూర్వక వ్యవస్థగా కొనసాగుతూ, ప్రజల ప్రతి శబ్దాన్ని వినిపించేలా కృషి చేయాలని సమావేశం విజ్ఞప్తి చేసిందన్నారు. కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలు ఆన్ లైన్ జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వడం, జర్నలిస్టులకు అధికారిక ప్రెస్ అక్రెడిటేషన్, సమావేశాల్లోకి ప్రవేశం వంటి సదుపాయాలు కల్పించడాన్ని జాతీయ కౌన్సిల్ సమావేశాలు స్వాగతిస్తూ, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

    ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేసి, డిజిటల్, వెబ్ మీడియా జర్నలిస్టులను ఇందులో చేర్చాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించిందని చెప్పారు. ప్రభుత్వాలు పాత్రికేయులను నియంత్రించే అంశంపై సమావేశాల్లో సుదీర్ఘ చర్చ జరిగిందని, అదేవిధంగా జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం, జాతీయ పెన్షన్ విధానం తీసుకురావాలని సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు కె.విక్రమ్ రావు అధ్యక్షతన మూడు రోజుల పాటు ఉత్సాహభరితంగా జరిగిన ఈ సమావేశాలను కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ప్రారంభించగా ముగింపు సమావేశాల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, యూపీ రాష్ట్ర మంత్రి ధారాసింగ్ చౌహాన్ పాల్గొని ప్రసంగించారని వివరించారు.

    దేశవ్యాపంగా దాదాపు ఐదు వందల మందికి పైగా జర్నలిస్టు ప్రతినిధులు హాజరైన ఈ సమావేశాలలో ఐఎఫ్ డబ్ల్యూజే సెక్రటరీ జనరల్ విపిన్ దులియా, ఉపాధ్యక్షులు మోహన్ కుమార్, కార్యదర్శులు నమ్రత బోరా, సంతోష్ చతుర్వేది, పులిపలుపుల ఆనందం, కె.శాంతకుమారి, కె.విశ్వదేవ్ రావు, కోశాధికారి రజత్ కె మిశ్రా, నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్, పీజీఐ ఎంప్లాయీస్ యూనియన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఇందుకాంత్ దీక్షిత్, సెక్రటరీ జనరల్ బలరామ్ యాదవ్​ తదితరులు ప్రసంగించారని తెలిపారు. 

Tags:    

Similar News